కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిది.. కేంద్రానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపిన తర్వాతనే కేంద్రం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. రెండు రాజధానులా.. మూడు రాజధానులా అనేది ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని తెలిపారు. రాజధానిపై బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, జీవీఎల్ భిన్న ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజధానిపై ఏపీ బీజేపీ శాఖ ఒక నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని కోరారు. ఏపీ రాజధాని అమరావతిని భారత చిత్ర పటంలో తానే పెట్టించినట్లు గుర్తుచేశారు. అలాగే రాజధాని రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కవిత ఓటమి తర్వాత బీజేపీ అంటే కేటీఆర్కు భయం పట్టుకుందని కిషన్ విమర్శించారు. చాలా మున్సిపాలిటీల్లో బీజేపీకి ఎంఐఎంకు మధ్యనే పోటీ ఉందన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే.. టీఆర్ఎస్కు వేసినట్టే.. టీఆర్ఎస్ గెలిస్తే.. ఎంఐఎం గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్కు, తెలంగాణ భవన్కు పెద్ద తేడా లేదన్నారు. కేసీఆర్ వైఫల్యాలే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రాలు అని చెప్పారు. సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో.. కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

