telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ చాలా గొప్పది : పీటర్సన్‌

Indian flag

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్‌ పీటర్సన్‌ ట్వీట్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌పై వ్యక్తపర్చిన ప్రేమకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా కుటుంబమేనని భార‌త్ భావిస్తుంద‌ని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలోని పలు దేశాల‌కు భార‌త్ క‌రోనా వైరస్ వ్యాక్సిన్‌ను పంపుతోన్న విష‌యం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జోహెనస్‌బర్గ్‌కు విమానంలో మందులను తరలించింది. వ్యాక్సిన్ల‌కు సంబంధించిన ఫొటోను భార‌త‌ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ ట్వీట్ చేశారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ట్వీట్‌పై కెవిన్‌ పీటర్సన్‌ స్పందిస్తూ భారత ప్రభుత్వం ఔదార్యాన్ని కొనియాడారు. ‘భారత దేశం ఉదారత, దయగల గుణం రోజురోజుకు పెరిగిపోతోంది. భారత్ ఎంతో ప్రియమైన దేశం’ అని కొనియాడారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ పట్ల మీకున్న ప్రేమను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచమంతా మా కుటుంబమనే భావిస్తాం. అలాగే కరోనా వైరస్‌పై పోరాటంలో మా వంతు సాయం అందిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.

కెవిన్‌ పీటర్సన్‌ పలు సందర్భాల్లో భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. అతడికి భారత్ విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే తనకు నచ్చిన అంశాలపై పీటర్సన్‌ స్పందిస్తుంటారు. ఎన్నోసార్లు భారత ఆటగాళ్లపై కూడా ప్రశంసలు కురిపించారు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా వాయిదా వేయడాన్ని కేపీ తప్పుపట్టారు. దక్షిణాఫ్రికా బదులు భారత పర్యటన అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా చేసేది కాదన్నారు. క్రికెట్‌లో ఇది మంచిది కాదని, తమ జట్టు కూడా దక్షిణాఫ్రికాతో రద్దు చేసుకున్న విషయాన్ని కేపీ గుర్తుచేశారు. ఇటీవ‌ల‌ శ్రీలంక పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా సోకిన‌ప్ప‌టికీ అక్కడ త‌మ జ‌ట్టు సిరీస్ గెలిచింద‌ని తెలిపారు.

Related posts