రిషభ్ పంత్‌కు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ విలువైన సలహా ఇచ్చాడు. ఇంగ్లీష్ గడ్డపై కాస్త దూకుడును తగ్గించుకోని ఆడాలని సూచించాడు. ‘రిషభ్ పంత్ జట్టులోకి వచ్చినప్పటి నాటి కంటే…ఇప్పుడు చాలా పరిణతి చెందిన క్రికెటర్‌లా కనిపిస్తున్నాడు. అతను షాట్లు ఎక్కువగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. మంచి షాట్లు ఆడగల సత్తా అతడి దగ్గర ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పంత్ ఆడే షాట్లు కూడా చూడచక్కగా ఉంటాయి. కానీ, ఇంగ్లండ్ పరిస్థితులు సవాళ్లు విసురుతాయి. అక్కడ ప్రతి బంతిని హిట్ చేయడానికి ప్రయత్నించకుండా క్రీజులో ఎక్కువ సమయం ఉండేలా ఆడాలి. పంత్ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆడాలి. లేకుంటే మూల్యం చెల్లించుకుంటాడు. ఎన్నో రకాల షాట్లు ఆడగలిగే రోహిత్ శర్మకు కూడా ఇదే చెప్పాం. చాలాసార్లు ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించి రోహిత్ ఔటయ్యాడు. పంత్‌కు కూడా అదే చెబుతున్నా. పంత్ అద్భుతమైన, ఎంతో విలువైన ఆటగాడు. అతడు షాట్లు ఆడటానికి ముందు ఎక్కువ సమయం క్రీజులో గడపాలి. ఇంగ్లండ్ పరిస్థితులు భిన్నమైనవి’ అని కపిల్‌దేవ్ చెప్పుకొచ్చాడు. ఇక సౌతాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే.
previous post