telugu navyamedia
క్రీడలు వార్తలు

వివాదంలో చిక్కుకున్న కుల్దీప్ యాదవ్…

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఈ టీమిండియా స్పిన్నర్‌పై కాన్పూర్ జిల్లా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండానే గెస్ట్‌హౌజ్‌లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న అతని వ్యవహారశైలిని తప్పుబట్టింది. ఆసుపత్రి నుంచి వ్యాక్సిన్ ఎలా బయటకు వెళ్లిందనేదానిపై కాన్పూర్ మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. ఇక 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుల్దీప్‌ యాదవ్‌, స్థానిక గోవింద్‌నగర్‌లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం అతిథి గృహంలోనే టీకా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను కుల్దీప్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కోవిడ్‌పై పోరులో అంతా ఒక్కటి కావాలని, అవకాశం ఉన్నవాళ్లు వెంటనే టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కాన్పూర్‌ జిల్లా అధికారుల కంటపడింది. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్‌ వ్యవహరించిన తీరుపై వారు విస్మయానికి గురయ్యారు. ఇక ఈ విషయంపై స్పందించిన కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అలోక్‌ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌లో కుల్దీప్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాడనే అంశంపై ఆరా తీస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండగా.. క్రికెటర్లకు ఎలా దొరకుతున్నాయనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related posts