ఏపీలో రాజకీయాలు రోజుకు ఒక రంగు పూసుకున్నట్టే ఉంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో తెలియడం లేదు. దీనితో ప్రధాన పార్టీలకు ఆకర్ష్ పధకాల రచనతోనే సరిపోతుంది. తాజాగా, వైసీపీ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అతి త్వరలోనే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా, చంద్రబాబును కలిసిన ఆయన రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు కాకినాడ ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సునీల్ కోరినట్టు సమాచారం. అయితే, ఇంతకుమించిన వివరాలు వెల్లడికానప్పటికీ చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.