telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జస్టిస్ ఎవి రవీంద్రబాబు సేవలు ప్రసంశనీయం హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి రవీంద్రబాబు అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ ఎవి రవీంద్రబాబు పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఎవి రవీంద్రబాబు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.

1962లో పూర్వపు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన జస్టిస్ ఎవి రవీంద్రబాబు ప్రకాశం జిల్లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప నెల్లూరు లోని విఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ల్లో జూన్ 1988 లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి చీరాల్లో శిక్షా స్మృతిలో లీడింగ్ లాయర్ అయిన లేటు ఎమ్.ఆర్.చౌధరి దగ్గర ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారన్నారు.

తదుపరి వారి ప్రాక్టీసును అద్దంకి మార్చడం జరిగిందని, 1994 మే మాసంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ గా ఎంపికై పలు ప్రాంతాల్లో పనిచేసి, 2005 లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొంది, 2012 లో డిస్ట్రిక్టు అండ్ సివిల్ జడ్జిగా నియమించబడ్డారన్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిశంబరు 2021 రిజిస్ట్రారు జనరల్ గా నియామకానికి ముందు ప్రిన్సిఫల్ డిస్ట్రిక్టు జడ్జిగా పనిచేస్తూ ఆగస్టు 2022 న ఈ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని ప్రశంసించారు. న్యాయ వృత్తిలో మూడు దశాబ్దాల పాటు సేవలు అందజేసిన వీరు ఎన్నో క్లిష్టమైన కేసులను ఎంతో సునాయాసంగా పరిష్కరించారన్నారు.

చట్టాల అభివృద్దితో పలు కమిటీల్లో సభ్యులుగా పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చడంలో ఎంతగానో దోహదపడ్డారని అభినందించారు.

న్యాయ సేవలో ఎనలేని అనుభవాన్ని గడించిన వీరు న్యాయాధికారులకు, భవిష్యత్ తరాల న్యాయవాదులకు, విద్యార్థులకు సూచనలు, సలహాలు మరియు మార్గదర్శకం చేసేలా పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

సిటింగ్ జడ్జిగా మాతో పనిచేసిన జస్టిస్ ఎ.వి.రవీంద్రబాబు మా కుటుంబ సభ్యలుగా ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ ఎవి రవీంద్రబాబు మాట్లాడుతూ న్యాయమూర్తిగా తన కెరీర్ లో సహాయ సహాకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయ మూర్తితో పాటు పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు,తన ఫేషీ అధికారులు,సిబ్బంది ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ బెంచ్ లో సిటింగ్ జడ్జిగా నేడే చివరి రోజు అవుతున్న నేపధ్యంలో తీపి చేదు భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలిపారు.

క్రింద స్థాయి నుండి ఈ స్థాయికి చేరుకుని మూడు దశాబ్దాలకు పైబడి న్యాయ సేవలు అందజేసిన నా ప్రయాణం న్యాయ వ్యవస్థలో నేటితో ముగుస్తున్నదన్నారు. ఈ హైకోర్టుతో నా బంధం 2021 జనవరి నుండి ప్రారంభం అయి అత్యల్ప సమయంలోనే ముగుస్తున్నది అనే విషయం ఏ మాత్రం ప్రధానం కాదని, మనం ఎంత క్రమశిక్షణతో, అంకితభావంతో నాణ్యమైన తీర్పులు వెలువరించామనే విషయమే ఎంతో ప్రధామైనదన్నారు.

నా తీర్పులకు సంబందించిన కేసుల్లో 90 శాతం కేసులు ఎంతో పోటీ తత్వంతో కూడుకున్నవని, అన్నిస్థాయి పరిశీలనల్లో ఈ తీర్పులు చెక్కుచెదరకుండా నిలబడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

న్యాయమూర్తిగా ఎన్నో క్లిష్టమైన కేసులకు సంతృప్తి కర స్థాయిలో తీర్పులు ఇవ్వడం జరిగిందని, తీర్పు ఫలితాలను ఆశించకుండా బార్ సభ్యులు ఎంత గానో సహరించారని, ఇది ఎంతో శుభపరిణామని అభినందించారు.

పలు కారణాల వల్ల క్రిమినల్ కేసులు దీర్ఝకాలికంగా అపరిష్కృతంగా ఉండిపోతున్నాయని, వీటిని సాద్యమైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

సమాజాభివృద్ది అనేది శాంతి భద్రతలను సక్రమంగా నిర్వహించడం వల్లే సాద్యమవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సి ఉందన్నారు.

ఆడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి మరియు అడిషనల్ సొలిసిటర్ జనరల్ తదితరులు మాట్లాడుతూ జస్టిస్ ఎవి రవీంద్రబాబు పలు క్రిమినల్ కేసుల్లో స్పష్టమైన తీర్పులు ఇవ్వడమే కాకుండా, సివిల్, క్రిమినల్ చట్టాలకు సంబంధించి అనేక అంశాల్లో చురుకైన పాత్రపోషించి న్యాయ వ్యవస్థకు మంచి సేవలు అందించారని కొనియాడారు.

అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈవీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, పలువురు ఇతర రిజిష్ట్రార్లు,సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు,ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ,ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts