telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మరోసారి ఆసుపత్రిలో చేరిన జపాన్ ప్రధాని… ఏడు గంటలపాటు పరీక్షలు

Japan

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జపాన్ ప్రధాని షింజో అబే మరోసారి ఆసుపత్రిలో చేరారు. టోక్యో ఆస్పత్రి వైద్యులు దాదాపు ఏడు గంటలపాటు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రధాని సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి వచ్చారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్థిక మంత్రి కట్సునోబు కటో తెలిపారు. ఏడాదికి రెండుసార్లు ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారని వివరించారు. షింజో అబేకు అత్యంత సన్నిహితుడైన లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత అకిరా అమరీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అవిశ్రాంతిగా విధులు నిర్వర్తించడంతోనే ప్రధాని అలసటగా ఉన్నారన్నారు. అనారోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి షింజో వైదొలగితే ఉప ప్రధాని తారో అసో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని కనుక రాజీనామా చేయాలనుకుంటే ఎన్నికలు ముగిసి మరొకరు ప్రధాని అయ్యే వరకు షింజోనే ఆ పదవిలో కొనసాగుతారని సమాచారం. ఈ ఏడాది జులై 6న షింజో అబే తన కార్యాలయంలో రక్తపు వాంతులు చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు ప్రచారం జరిగింది. అయితే అధికారులు దీనిని ఖండించారు.

కాగా అత్యధిక కాలం జపాన్ ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు నెలకొల్పారు. సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన ఐసాకు సాటో అర్ధ శతాబ్దం కిందట నెలకొల్పిన రికార్డును సోమవారం అబే అధిగమించారు. తొలుత 2006లో సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబే.. కూటమిలో విభేదాలతో 2007లో రాజీనామా చేశారు. తిరిగి 2012లో రెండోసారి ప్రధానిగా ఎన్నికై అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

Related posts