telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పీపీపీ విధానంలో ఏపీలోని మెడికల్ కాలేజీలను నిర్మిస్తే, తన అవినీతి బయటపడుతోందని జగన్ భయపడుతున్నారు: ఎంపీ సి ఎం రమేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అనకాపల్లి ఎంపీ రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలు, అవినీతి బయటపడతాయనే భయంతో ఏపీ అసెంబ్లీకి జగన్ రావడం లేదని సెటైర్లు గుప్పించారు.

అనకాపల్లి జిల్లాలో ఎంపీ రమేశ్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుర్చీలో ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్తే తాను సెల్యూట్ కొడతానని స్పష్టం చేశారు.

ఇటీవల పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తే జగన్‌కి ప్రజా మద్దతు ఎలా ఉందో తెలుస్తోందని విమర్శించారు ఎంపీ రమేశ్.

గతంలో తమిళనాడులో ఒక్కరే గెలిచిన కరుణానిధి కూడా అసెంబ్లీకి వెళ్లారని గుర్తుచేశారు. నిన్న జగన్‌కి వచ్చిన జనం ఒక ఎమ్మెల్యే రోడ్ షో చేసిన కూడా వస్తారని ఎద్దేవా చేశారు.

పీపీపీ విధానంలో ఏపీలోని 17 కాలేజీలను నిర్మిస్తే, తన అవినీతి బయటపడుతోందని జగన్ భయపడుతున్నారని విమర్శించారు.

అధికారంలో ఉండి జగన్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి కూడా అలాగే వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు.

మెడిక ల్ కళాశాలల పీపీపీ విధానంపై జగన్‌కి కనీస అవగాహన లేదని ఆక్షేపించారు ఎంపీ రమేశ్.

దేశంలో గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించి జగన్ మాట్లాడాలని హితవు పలికారు.

డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే  జగన్‌ అండ్ కో అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఏపీకి పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలకు మెయిల్ పంపించి జగన్‌ అండ్ కో బెదిరిస్తున్నారని ఆరోపించారు ఎంపీ రమేశ్.

జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యదీక్షతతో ఏపీని అభివృద్ధి చేసి తీరుతామని ఉద్ఘాటించారు.

జగన్‌కి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని దేనికైనా సమాధానం చెప్పడానికి కూటమి పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారని, చర్చకు రావాలని ఎంపీ రమేశ్ సవాల్ విసిరారు.

Related posts