ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. పేపర్ల లీకేజీ పై అటు ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్ శాఖ గానీ వివరణ ఇవ్వకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీ స్కామ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరు విప్పడం లేదని విమర్శించారు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను తాము నిర్వహించలేదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అంటోందన్నారు. 18 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలని ప్రశ్నించారు. ఈ అవకతవకలపై ప్రశ్నిస్తున్న తమను టీడీపీ ఓర్వలేకపోతుందని అంటారా? అని మండిపడ్డారు. అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా? అని ప్రశ్నించారు.