telugu navyamedia
క్రీడలు వార్తలు

మొత్తానికి మహిళ జట్టుకు ప్రైజ్‌మనీ విడుదల…

టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి 15 నెలల పాటు కాలయాపన చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ దిగొచ్చింది. ఎట్టకేలకు ఆ ప్రైజ్‌మనీని విడుదల చేసింది. ఈ మేరకు టీమిండియా విమెన్స్ జట్టుకు సమాచారాన్ని పంపించింది. తమ ఇన్‌వాయిస్‌లను పంపించాల్సిందిగా సూచించింది. గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్-ఆసీస్ జట్లు తలపడ్డాయి. భారత జట్టు ఓడిపోయింది. కానీ రన్నరప్‌గా నిలిచినందుకు టీమిండియా విమెన్స్ జట్టుకు సుమారు మూడున్నర కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది. టోర్నమెంట్ ముగిసిన రెండో నెలలోనే ఐసీసీ ఈ అమౌంట్‌ను విడుదల చేసింది. బీసీసీఐకి కేటాయించింది. ఆ మొత్తాన్ని బీసీసీఐ టీమ్ మెంబర్లకు విడుదల చేయలేదు. దాంతో మహిళలు అనే వివక్షతను బీసీసీఐ ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో మెట్టు దిగక తప్పలేదు. ప్రైజ్‌మనీని అందజేస్తామని టీమ్ మెంబర్లకు సమాచారాన్ని అందజేసింది. ఇన్‌వాయిస్‌లను పంపించాల్సిందిగా కోరింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టులో ఒక్కో మెంబర్‌కు 18,65,556 రూపాయలు అందుతుంది. ఇన్‌వాయిస్ తమకు అందిన వెంటనే- వారి వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లలోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తామని బీసీసీఐ వివరణ ఇచ్చినట్లు సమాచారం

Related posts