telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను, చిల్లర రాజకీయాలు చేయను: హరీశ్ రావు

బీఆర్ఎస్ మాజీ నేత, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో హరీశ్ రావు రహస్యంగా భేటీ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కాళేశ్వరం కమిటీ నోటీసులు జారీ చేసిన తర్వాత ఈటల, హరీశ్ భేటీ అయ్యారని, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో ఫోన్ లో చర్చలు జరిపారని కూడా మహేశ్ గౌడ్ ఆరోపించారు.

ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తాజాగా స్పందించారు. పీసీసీ చీఫ్ హోదాలో మహేశ్ గౌడ్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

నేరుగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఇది సిగ్గుచేటని హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.

‘‘విలువలకు తిలోదకాలు ఇచ్చి, రేవంత్ రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్ధాలు నిజం అయిపోవు.

పెళ్ళిలోనో, చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, మా పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను.

ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నాం’’ అంటూ హరీశ్ రావు ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.

Related posts