టిఫానీ ట్రంప్ పై వ్యాఖ్యలు చేసిన ట్రంప్ పీఏ మ్యాడెలిన్ వెస్టర్ హౌట్ ఉద్యోగం ఊడింది. ఆమె ఇటీవల ఓ పార్టీలో ఇతరులతో మాట్లాడుతూ, ట్రంప్ కుమార్తె టిఫానీ ఊబకాయంతో బాధపడేదని, అందుకే ఆమె ఫొటోలను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. భవిష్యత్తులో మ్యాడెలిన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది. అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన సమాచారం లీక్ చేసిందంటూ ఆమెపై ఆరోపణలు మోపింది. దీనిపై ట్రంప్ స్పందించారు.
ఈ ఘటన అనుకోకుండా జరిగిన సంఘటన అని మ్యాడెలిన్ ఎంతో బాధపడుతున్నారని, ఆమె మద్యం సేవించి మాట్లాడినట్టు తెలిపారని ట్రంప్ వివరించారు. తనకు కుమార్తెలంటే చాలా ఇష్టమని, ఇలాంటి ఆరోపణలను తాను అంగీకరించనని స్పష్టం చేశారు. మొదటినుంచి ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరిస్తున్న మ్యాడెలిన్ పనితీరుపై ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ట్రంప్ కూడా ఎన్నోసార్లు తన పీఏ గురించి ప్రశంసించేవారు. అలాంటిది, ఉన్నట్టుండి ఆమెపై వేటు వేయడంతో విపక్షాలతో పాటు సొంత పార్టీలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.