భావితరాలకు భవిష్యత్‌ని ఇవ్వడం కోసం హైడ్రా పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉద్ఘాటించారు.
చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వెళ్లడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది.
ఈ సందర్భంగా అంబర్‌పేట్ బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మాజీ ఎంపీ వి. హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు.
హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్‌మెంట్ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమేనని.. త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.