తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ డీఏ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 1 జనవరి నుంచి 1 జూలై వరకు డీఏను 3.144 శాతం పెంచాలని నిర్ణయించిందన్నారు. దీంతో ఉద్యోగుల మొత్తం డీఏ 33.536 శాతానికి చేరుకుంటుందని కేసీఆర్ తెలిపారు. ఆర్థిక మాంద్యం పట్టి పీడిస్తున్న తరుణంలో తెలంగాణ కూడా దెబ్బతింటోందన్నారు.
కేబినెట్ భేటీలోని మరికొన్ని నిర్ణయాల విషయానికి వస్తే.. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధించాలనే విషయంపై విస్తృత చర్చ జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీని నియమించాము. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్ వ్యవస్థీకరించే అంశం పరిశీలించాలని కేబినెట్ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కేసీఆర్ తెలిపారు.