telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తీస్తే సరిపోదు… శంకర్ పై రాధారవి కామెంట్స్

shankar

శంకర్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో ముగ్గురు మరణించగా 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కమల్‌హాసన్‌, కాజల్‌ అగర్వాల్‌ తృటిలో తప్పించుకోగా దర్శకుడు శంకర్ కాలికి గాయమైంది. మృతుల్లో శంకర్‌ పర్సనల్ అసిస్టెంట్ మధు (28), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్‌ (60) ఉన్నారు. మృతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున) రూ.3 కోట్లు ఆర్థికసాయం అందచేస్తున్నట్టు కమల్ హాసన్ ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారాయన. అయితే ఈవీపీ ఫిలింసిటీలో జరిగిన ఈ ప్రమాదంపై తాజాగా చెన్నై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రేన్ ఆపరేటర్‌తో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే హీరో కమల్‌కు నోటీసులు జారీ చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌‌పై కేసు నమోదు చేశారు. దర్శకుడు శంకర్, కమల్ హాసన్‌కు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై సినీ నటుడు, తమిళనాడు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవి స్పందిస్తూ దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయగానే సరిపోదని, సెట్‌లో ఉన్నవారికి రక్షణ కల్పించాలని అన్నారు. ‘శంకర్ హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయాలని అనుకుంటాడు. కానీ సినిమాల కోసం పనిచేస్తున్న వారి రక్షణ గురించి మాత్రం పట్టించుకోడు’ అన్నారు.

Related posts