telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ గదులు ఏర్పాటు కు ప్రభుత్వ నిర్ణయం

పాఠశాల వేళల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ఆటల సమయంలో గాయపడినప్పుడు విశ్రాంతి చాలా కీలకం.

ఇలాంటి సందర్భాల్లో విద్యార్థిని కొంతసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించడం, ప్రాథమిక వైద్య సహాయం అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ గదులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక సిక్‌ రూమ్‌లను 2026 మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది.

అందుకోసం స్కూల్‌లో పెద్దగా ఉండే ఒక తరగతి గదిని రెండుగా విభజించి సిక్‌ రూమ్‌గా మారుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 600లకు పైగా పీఎంశ్రీ పాఠశాలల్లో తొలి దశలో వీటిని ఏర్పాటు చేస్తారు.

ఒక్కో సిక్ రూమ్ కోసం రూ. 5 లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది సర్వ శిక్ష అభియాన్. పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఈ సిక్‌ రూమ్‌ల నిర్వహణకు స్కూల్ సిబ్బందితో పాటు ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు.

స్థానిక ఆసుపత్రుల సహకారంతో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సిక్ రూమ్‌లో చేతులు కడుక్కునేందుకు, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా మరుగుదొడ్లు, మంచినీరు, శానిటరీ ప్యాడ్లు అందుబాటులో ఉంచుతారు.

గాయాలు అయినప్పుడు ప్రథమచికిత్స కోసం ఉపయోగించే ఫస్ట్‌ఎయిడ్‌ కిట్‌లు ఉంటాయి. క్లినికల్ వేస్ట్ కోసం ప్రత్యేక బిన్‌లు కూడా ఉంటాయి.

ఇక ప్రాథమిక ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉంటాయి.
ప్రతి సంఘటన రికార్డ్ చేసేందుకు, అత్యవసర సేవలకు సమాచారం అందించేందుకు ప్రత్యేక టెలిఫోన్ లైన్ ఉంటుంది.

Related posts