telugu navyamedia
క్రీడలు వార్తలు

టీ20 బరిలోకి యువరాజ్…

Yuvraj

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ‌ప్రపంచకప్‌ల హీరో యువ‌రాజ్ సింగ్ మ‌ళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ ఎంపిక చేసిన ప్రాబ‌బుల్స్ జాబితాలో యువ‌రాజ్ పేరు ఉండ‌టం విశేషం. ఈ టోర్నీ కోసం 30 మంది ప్రాబబుల్స్ జాబితాను పంజాబ్ ప్ర‌క‌టించింది. యువీ ఇప్ప‌టికే మొహాలీలోని ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తుండటం మరో విశేషం. అయితే 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో యువ‌రాజ్ సింగ్ పేరు ఉన్నా.. పంజాబ్ టీమ్‌కు అతడు ఆడ‌తాడా లేదా అన్న విష‌యంపై మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. యువీ ఇప్ప‌టికే ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. మ‌ళ్లీ క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకోవ‌డం చాలా సంతోషంగా ఉందంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ నెల 18 నుంచి పంజాబ్ ప్లేయ‌ర్స్ కోసం లుధియానాలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లోనూ యువీ పాల్గొన‌నున్నాడు. గ‌తేడాది ఇంట‌ర్నేష‌నల్ క్రికెట్ నుంచి తాను రిటైర‌వున్న‌ట్లు ప్ర‌క‌టించిన యువ‌రాజ్ సింగ్.. ఆ త‌ర్వాత కెన‌డాలో జ‌రిగిన గ్లోబ‌ల్ టీ20 లీగ్ స‌హా ప‌లు విదేశీ లీగ్స్‌లో ఆడాడు. బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం యాక్టివ్ ప్లేయ‌ర్స్‌కు విదేశీ టీ20 లీగ్‌ల‌లో ఆడేందుకు అనుమ‌తి ఉండ‌దు. ఇలాగే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి విదేశీ లీగ్‌ల‌లో ఆడిన ప్ర‌వీణ్ తంబెని ఐపీఎల్‌లో ఆడ‌నివ్వ‌లేదు. అయితే పీసీఏ సెక్ర‌ట‌రీ పునీత్ బాలి విజ్ఞ‌ప్తి మేర‌కు త‌న రిటైర్మెంట్‌పై పున‌రాలోచ‌న చేస్తున్న యువీ.. అందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జై షాను కోరాడు.

యువరాజ్‌ సింగ్‌ గతేడాది జూన్‌లో అన్ని రకాల క్రికెట్‌కు‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాదిన్నర గడిచింది. ఈ సమయంలో విదేశీ టీ20 లీగుల్లో ఆడాడు. అక్కడ బాగానే ఆకట్టుకున్నాడు. ఓ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించాడు. కొన్నాళ్లుగా అతడు శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌కు మొహాలీలోని పీసీఏ స్టేడియంలో పంజాబ్‌ సంఘం తరఫున వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా బ్యాట్ పట్టుకొని నెట్స్‌లో షాట్లు ఎలా ఆడాలో నేర్పించాడు. ఆటగాళ్లతో పాటు యువీ కూడా భారీ షాట్లు ఆడాడు. దీంతో పంజాబ్‌ కార్యదర్శి పునీత్‌ బాలి అతడిని కలిసి రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోవాలని కోరాడు. ఒకవేళ బీసీసీఐ నుంచి యువరాజ్‌ సింగ్‌కి అనుమతి లభిస్తే మళ్లీ విదేశీ లీగ్‌ల్లో పాల్గొనేందుకు అతనికి అవకాశం ఉండదు. పంజాబ్‌ తరఫున కొన్ని సీజన్లలో ఆడేందుకు యువీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని సమాచారం తెలిసింది. ప్రస్తుతం అతడు టీ20లతో ప్రారంభించనున్నాడు. తర్వాత తన మనసు మార్చుకొని మిగతా ఫార్మాట్లలోనూ బరిలో దిగనున్నట్లు సమాచారం తెలుస్తున్నది. ఒకవేళ యువీ మళ్లీ బరిలోకి దిగితే.. ఇక భారత అభిమానులకు పండగే.

Related posts