ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో చోటు దక్కని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇంకా అసంతృప్తి రగలుతోంది . ఇప్పటికే చాలా మంది నేతలను సీఎం జగన్ తో పాటు పార్టీ అధిష్టానం బుజ్జగించినా.. కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పదవి దక్కకపోవడంపై మండిపడుతున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్‌లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు.
తనకు మంత్రి పదవి రాకుండా అధిష్ఠానమే దెబ్బకొట్టిందని.. అవకాశం వచ్చినప్పుడు తానేంటో చూపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్ అయ్యాయని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని త్యాగాలు చేసినా అమాయకుడ్ని చేసి పదవి ఇవ్వలేదన్నారు.
అయితే తాను అమాయకుడిని కాదని, నూటికి నూరు శాతం హింసా వాదినని, లక్షమందితో మీటింగ్ పెట్టి చెప్పమన్నా చెప్తానన్నారు. కావాలంటే జైల్లో పెట్టాలని భయపడేది లేదు.. సింహంలా ఉంటానని, సింహంలానే బతుకుతానని గొల్ల బాబూరావు అన్నారు.

