telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గేమ్ ఓవర్‌ .. మా వ్యూ …

game over movie review

చిత్రం : గేమ్ ఓవర్‌
న‌టీన‌టులు: తాప్సి, వినోదిని వైద్యనాథ‌న్‌, అనీష్ కురువిల్లా, సంచిత న‌ట‌రాజ‌న్‌, ర‌మ్య సుబ్రహ్మణ్యన్‌, పార్వతి త‌దిత‌రులు
స‌ంగీతం: రోన్ ఏతాన్ యోహాన్
కూర్పు: రిచర్డ్ కెవిన్
రచన: అశ్విన్ శరవణన్, కావ్య రాంకుమార్
మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా ఛాయాగ్రహణం: ఎ.వసంత్
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్
సంస్థ: వై నాట్ స్టూడియోస్‌
విడుద‌ల‌: 14 జూన్ 2019

తాప్సి బాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోంది. న‌ట‌న‌కి ప్రాధాన్యమున్న చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే ఆమె హిందీలో ఎంత బిజీగా ఉన్నా ద‌క్షిణాదిని మాత్రం మ‌రిచిపోలేదు. ముఖ్యంగా తెలుగులో క్రమం త‌ప్పకుండా ఏడాదికో సినిమా చేస్తున్నారు. ఆమె ఇక్కడ వాణిజ్య ప్రధాన‌మైన చిత్రాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నా… వాటికి భిన్నంగా ప్రస్తుతం క‌థాబ‌ల‌మున్న చిత్రాలే చేస్తున్నారు. ఆమె నటించిన ‘గేమ్ ఓవ‌ర్’ చిత్రం ఈ కోవకు చెందినదే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి తాప్సి ‘గేమ్ ఓవ‌ర్’ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ :
స్వప్న (తాప్సి) ఒక వీడియో గేమ్ డిజైన‌ర్‌. ఆమెకి గేమ్స్ ఆడ‌టమన్నా ఇష్టమే. అనుకోకుండా ఆమె జీవితంలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. అప్పట్నుంచి చీకటంటే భ‌యప‌డుతుంటుంది. త‌ల్లిదండ్రుల‌కి దూరంగా, ప‌ని మనిషి క‌ళ‌మ్మ (వినోదిని వైద్యనాథ‌న్‌)తో క‌లిసి ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. స్వప్న త‌న చేతికి ఒక ప‌చ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ ప‌చ్చబొట్టు రంగులో అమృత (సంచిత న‌ట‌రాజ‌న్‌) అస్తిక‌లు కూడా క‌లుస్తాయి. ఆ ప‌చ్చబొట్టు స్వప్నపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇంత‌కీ అమృత ఎవ‌రు? ఆమె ఎలా చ‌నిపోయింది? అమృత త‌ర‌హాలోనే స్వప్నకి కొన్ని సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

టెక్నికల్ :
ఇదొక విభిన్నమైన థ్రిల్లర్ సినిమా. నిడివి వంద నిమిషాలే. కానీ ఒక ఆత్మ క‌థ‌తో పాటు… సీరియ‌ల్ కిల్లర్స్ నేప‌థ్యాన్ని, మానసిక ప‌ర‌మైన సంఘ‌ట‌న‌ల్ని ఇందులో స్పృశించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. క‌థ మొద‌ల‌వ‌గానే ప్రేక్షకుడిని స్వప్న ప్రపంచంలోకి తీసుకెళ‌తాడు ద‌ర్శకుడు. ఆ క్రమంలో కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించినా… ఆ త‌ర్వాత క‌థ‌నం కట్టిప‌డేస్తుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌తని రేకెత్తిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ క‌థల్లో మ‌లుపుల వెన‌క సంఘ‌ట‌న‌లు చివ‌రి వ‌ర‌కుగానీ రివీల్ కావు. కానీ ఈ సినిమాలో కీల‌క‌మైన మ‌లుపుల వెన‌క సంఘ‌ట‌న‌ల్ని ముందుగానే బ‌య‌టపెట్టాడు ద‌ర్శకుడు. అయినా చివ‌రివ‌ర‌కు ఉత్కంఠని రేకెత్తిస్తూ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. అందుకు కార‌ణం క‌థ‌లో ఉన్న లేయ‌ర్లే. వీడియో గేమ్ డిజైనింగ్ నేప‌థ్యంతో కూడిన ఈ క‌థ‌ని అదే త‌ర‌హాలో, ఒక ఆటలో ఉన్న ఆస‌క్తికి, ఉత్కంఠ‌కి త‌గ్గట్టుగానే స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. ఇలాంటి సినిమాలు లాజిక్‌ల‌కి అతీతంగా సాగుతుంటాయి. థ్రిల్లర్ క‌థ‌లు చెప్పేట‌ప్పుడు ద‌ర్శకులు ఎలాంటి స్వేచ్ఛని తీసుకుంటారో, అదే ర‌క‌మైన స్వేచ్ఛని తీసుకుని స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. దాంతో అమృత‌ని చంపిన సైకో కిల్లర్లే స్వప్నని ద‌గ్గరికి ఎలా వ‌చ్చారనే ప్రశ్న మొద‌లుకొని.. క‌థానాయిక‌కి ముందుగానే క‌ల‌లు వ‌చ్చే తీరు, క‌ర‌డుగ‌ట్టిన సైకో కిల్లర్లు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చున్న అమ్మాయి చేతిలో మ‌రణించే వైనం వాస్తవానికి దూరంగా అనిపిస్తాయి. కానీ వాటిని సైతం న‌మ్మేలా చేయడంలో ద‌ర్శకుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. అసలు ఆ సైకో కిల్లర్లు ఎవ‌రు? ఎందుకు చంపుతున్నాడనే విష‌యాన్ని కూడా ఇందులో ప్రస్తావించ‌లేదు. దాంతో క‌థ అసంపూర్ణంగా అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలు ఇష్టప‌డే ప్రేక్షకులకి అమితంగా న‌చ్చుతుందీ చిత్రం.

నటీనటులు :
తాప్సి న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది. సినిమా అంతా ఆమె చుట్టూనే సాగుతుంటుంది. చ‌క్కటి హావ‌భావాలు ప‌లికిస్తూ పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. న‌ట‌న‌లో తాప్సి ప‌రిణ‌తిని చాటి చెప్పే చిత్రమిది. ఇందులో ప‌రిమిత‌మైన పాత్రలే క‌నిపిస్తాయి. పని మనిషి పాత్రలో వినోదిని వైద్యనాథ‌న్ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. అమృత అనే అమ్మాయిగా సంచిత కనిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా.. ఆమె కూడా ఆక‌ట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అశ్విన్‌, కావ్య రామ్‌కుమార్‌లు క‌లిసి క‌థ‌, క‌థ‌నాల్ని రాసుకున్న విధానం మెప్పిస్తుంది. రోన్ ఏతాన్ యోహాన్ సంగీతం, ద్వితీయార్ధంలో రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్‌, ఎ.వసంత్ ఛాయాగ్రహ‌ణం చిత్రానికి ప్రధాన బ‌లం. ఇదివ‌ర‌కు ‘మ‌యూరి’తో ఆక‌ట్టుకున్న దర్శకుడు అశ్విన్, మ‌రోసారి త‌న ప్రత్యేక‌త‌ని ప్రద‌ర్శిస్తూ ఈ సినిమా తీశాడు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు:
తాప్సి న‌ట‌న‌
క‌థ‌, క‌థ‌నం
ఛాయాగ్రహ‌ణం, సంగీతం

బ‌ల‌హీన‌త‌లు:
ప్రధమార్ధంలో కొన్ని స‌న్నివేశాలు

రేటింగ్ :
2.75 / 5

Related posts