telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వజ్రకవచధర గోవింద .. మా వ్యూ ..

vajrakavacha govinda movie review

చిత్రం: వజ్రకవచధర గోవింద
నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి, అర్చన, వేణు తదితరులు
సంగీతం : బుల్గానియన్
నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : అరుణ్ పవర్
బ్యానర్‌: శివ శివమ్‌ ఫిల్మ్స్‌
విడుదల తేదీ: 14-06-2019

నటుడు సప్తగిరి కమెడియన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కమెడియన్స్‌ కథానాయకులుగా మారుతున్న నేటి కాలంలో సప్తగిరి కూడా ఇటువైపు అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో మెప్పించారు. ఇప్పుడు మరోసారి కథానాయకుడిగా ‘వజ్ర కవచధర గోవింద’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు? నిధి వేట నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగా సప్తగిరి మరోసారి అలరించాడా?

అల్లరి దొంగ గోవింద్‌(సప్తగిరి)కు రూ.10కోట్లు సంపాదించడమే తన కల. ఆ డబ్బుతో తన ఊళ్లో ఉన్న క్యాన్సర్‌ బాధితులకు చికిత్స అందించాలని అనుకుంటాడు. డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అనుకోకుండా ఓ వజ్రాలగ్యాంగ్‌తో పరిచయం అవుతుంది. వారితో కలిసి నిధుల వేటకు బయలుదేరతాడు. అందరూ ఒక పురాత ఆలయానికి చేరుకుంటారు. ఆ ఆలయ సొరంగంలో వాళ్లకొక వజ్రం దొరుకుతుంది. దాని ఖరీదు దాదాపు రూ.150కోట్లు. దాన్ని అమ్మేసి, అందరూ పంచుకుందామని ఒప్పందం చేసుకుంటారు. ఈ క్రమంలో గోవింద్‌ ఆ వజ్రాన్ని పట్టుకుని తన ఇంటికి వెళ్లిపోతాడు. మిగిలినవాళ్లు రూ. 200కోట్లు బేరం మాట్లాడుకొని గోవింద్‌ ఊరికి వెళ్తారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ‘ఆ వజ్రమూ తెలియదు.. మీరూ తెలియదు’ అని ఎదురు తిరుగుతాడు గోవింద్‌. అసలు గోవింద్‌ ఎందుకు అలా అబద్ధం ఆడాడు? వజ్రం కథ ఏమైంది? చివరకు దాన్ని ఎలా సంపాదించారు? ఆ ఊరి సమస్యను ఎలా తీర్చారన్నదే చిత్ర కథ!

టెక్నికల్ టీం :
సప్తగిరి కమెడియన్‌గా పాపులర్‌.. తనకు నప్పే కథలను ఎంచుకుని అప్పుడప్పుడు హీరోగా కూడా మారుతున్నాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాల్లో తనదైన శైలిలో నవ్వించాడు. మళ్లీ అలాంటి ఓ వినోదాత్మక కథను ఎంచుకున్నాడు. ఈ కథలో అన్ని అంశాలు ఉన్నాయి. అయితే, ప్రథమార్ధంలో వినోదం కంటే, సెంటిమెంట్‌ పాళ్లకే ఎక్కువ అవకాశం ఇచ్చాడు దర్శకుడు. ఆ ఊరి తాలూకు కథ.. క్యాన్సర్‌ బాధితుల సమస్యలు.. ఎమ్మెల్యే చేసిన మోసం.. ఇలా చాలా సన్నివేశాలు బరువుగా సాగుతాయి. వాటి మధ్య సప్తగిరి చేసే అల్లరి.. దొంగ స్వామిగా పంచిన వినోదం.. నిధుల కోసం చేసే అన్వేషణ సరదాగా సాగిపోతాయి. నిధుల అన్వేషణ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఆ రకంగా చూస్తే, ఈ కథలో కొత్త పాయింట్‌ ఉండదు. కానీ, వజ్రాన్ని ఎక్కడ పెట్టాడో మర్చిపోవడం.. అన్నది కాస్త కొత్తగా అనిపిస్తుంది. సంపాదించిన వజ్రాన్ని పోగొట్టుకుని, మళ్లీ తిరిగి ఎలా దక్కించుకున్నాడనేది ద్వితీయార్ధంలో చూపించారు.

అక్కడక్కడా సెంటిమెంట్‌లోతు ఎక్కువైనా ప్రథమార్ధంలో కథ సాఫీగా సాగిపోతుంది. సెకాండాఫ్‌లో ఏం చేయాలో మాత్రం దర్శకుడికి పాలుపోలేదు. సప్తగిరికి మతి పోయిందని చెప్పి, మళ్లీ గతం గుర్తుకు తెచ్చేలా చేసే ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఆయా సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. హిప్నాటిజం నేపథ్యంలో సాగే సన్నివేశంలో బూతులు, ద్వందార్థాలు ఎక్కువగా దొర్లుతాయి. పతాక సన్నివేశాలు కూడా సాధారణంగా ఉంటాయి. ఎమ్మెల్యే అర్చనలో వచ్చిన మార్పు కూడా కృతంగా అనిపిస్తుంది. వజ్రానికి సంబంధించిన ట్విస్టు అంతగా అతికినట్లు అనిపించదు. ఆ వజ్రాన్ని ముందుగా రాయిగా చూపించి, ఆ తర్వాత దానిపై నీలం రంగు కోటింగ్‌ వేసినట్లు అనిపిస్తుంది. అది ఒక్కో సమయంలో ఒక్కో రంగులో కనిపిస్తుంది.

నటీనటులు :
సప్తగిరిలో మంచి కమెడియన్‌. వినోదాత్మక సన్నివేశాలు అతని నటన ఇదివరకు చిత్రాల్లో మాదిరిగానే ఉంది. మంచి ఎనర్జిటిక్‌గా చేశాడు. సప్తగిరి సినిమాలన్నీ సరదాగా సాగిపోవాలి. అయితే, ఎమోషన్‌ డ్రామా ఎక్కువగా ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. ఎమ్మెల్యేగా అర్చన కనిపించింది రెండు, మూడు సన్నివేశాల్లోనే. బంగారప్ప పాత్రలో కనిపించిన నటుడు డైలాగ్‌లు తక్కువ.. అరుపులు అరుపులు ఎక్కువయ్యాయి. ‘జబర్దస్త్‌’ గ్యాంగ్‌ను ఈ సినిమాలో దించేశారు. వాళ్లు తమ పరిధి మేరకు నటించే ప్రయత్నం చేశారు.

సాంకేతికంగా… చిన్న సినిమా అయినా, నాణ్యత పరంగా ఎక్కడా రాజీ పడలేదు. పాటలు ఎక్కువైపోయినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని డైలాగ్‌లు నవ్విస్తాయి. అయితే, వాటిలోనూ ద్వందర్థాలు పంటికింద రాయిలా తగులుతాయి. నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే, ఆ కథను సగంలోనే వదిలేశాడు దర్శకుడు. దేవాలయం కింద దాగి ఉన్న అపురూపమైన నిధి ఏమైందన్న విషయాన్ని చివరి వరకూ చెప్పలేదు.

బలాలు:
సప్తగిరి కామెడీ
ప్రథమార్థం

బలహీనతలు:
ఎమోషన్‌ డోస్‌ ఎక్కువ
ద్వితీయార్ధం

రేటింగ్ :
2.75/5

Related posts