telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేపటి నుండే .. ప్రైవేట్ రైలు టికెట్ బుకింగ్ … 25లక్షల ఉచిత బీమా ..

first private train booking open tomorrow

తేజస్‌ రైలు వచ్చే నెలలోనే పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఆ ప్రయాణానికి టిక్కెట్ల విక్రయం రేపట్నుంచే ప్రారంభం కాబోతోంది. దిల్లీ- లఖ్‌నవూ మధ్య ఐఆర్‌సీటీసీ నడపనున్న ఈ తొలి ప్రైవేటు రైలులో ప్రయాణానికి ఈ నెల 20 నుంచి టిక్కెట్లను విక్రయం జరుగుతుంది. ఈ రైలులో తొలి రోజు ప్రయాణం కోసం రేపటి నుంచి టికెట్లను విక్రయిస్తారని తెలిపింది. అక్టోబర్‌ 4న ఈ రైలును ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లఖ్‌నవూ నుంచి దిల్లీకి తొలి సర్వీసును ప్రారంభించనున్నారు. లఖ్‌నవూ – దిల్లీ నగరాల మధ్య ఈ రైలు రాకతో ప్రయాణానికి 6గంటల 15 నిమిషాల సమయం పట్టనుంది. లఖ్‌నవూలో ఉదయం 6.10 గంటలకు బయల్దేరి కాన్పూర్‌, ఘజియాబాద్‌ల మీదుగా మధ్యాహ్నం 12.25 గంటలకు దిల్లీకి చేరుకుంటుంది. ఐఆర్‌సీటీసీ నడపనున్న ఈ తొలి రైలులో ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ఏసీ చైర్‌ కార్‌ కోచ్‌ ఉంటుంది. దీంట్లో 56 సీట్లు ఉంటాయి. దాంతో పాటు మరో తొమ్మిది ఏసీ చైర్‌ కార్‌ కోచ్‌లు కూడా ఉంటాయి. ఈ ఒక్కో కోచ్‌లో 78 మంది ప్రయాణికులు చొప్పున కూర్చొనేలా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ రైలులో ప్రయాణించే వారి కోసం ట్యాక్సీ, హోటల్‌ బుకింగ్‌ సదుపాయాలను కూడా ఐఆర్‌సీటీసీ కల్పించనుంది.

ఐఆర్‌సీటీసీ ఈ రైలులో ప్రయాణించేవారికి రూ.25లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. దీంతో పాటు దిల్లీ రైల్వే స్టేషన్‌లోని ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లో కూర్చొనే సదుపాయం, లఖ్‌నవూ జంక్షన్‌లో విశ్రాంతి గదులను కూడా ఉపయోగించుకొనే సదుపాయం కల్పించనున్నారు. అలాగే, ప్రయాణీకులకు ఆహారం పంపిణీ చేయడంతో పాటు రైళ్లలోనే టీ, కాఫీ యంత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. తాగునీటిని ఆర్‌వో యంత్రాల ద్వారా సమకూర్చనున్నారు. దిల్లీ – లఖ్‌నవూ మధ్య తిరిగే ఈ రైలు మంగళవారం తప్ప వారంలో ఆరు రోజుల పాటు సేవలందించనుంది. అత్యాధునిక హంగులతో ఈ రైలును ఐఆర్‌సీటీసీ తీర్చిదిద్దింది. ఎల్‌ఈడీ టీవీ, కాల్‌ బటన్స్‌, ఆటోమేటిక్‌ డోర్లు, సీసీటీవీ కెమెరాలను కూడా రైలులో ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్‌ – ముంబయి సెంట్రల్‌ మధ్య కూడా ఐఆర్‌సీటీసీ మరో తేజస్‌ రైలును నడపనుంది. ఈ రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇంకా ఆ సంస్థ ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.

Related posts