telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నేడే కరోనా పుట్టినరోజు…

corona vairus

కరోనా వైరస్‌ బయటపడి  సరిగ్గా ఈ రోజుకు ఏడాది పూర్తవుతోంది. ఇది కచ్చితంగా ఎప్పుడు బయటపడిందనే దానిపై భిన్నాభిప్రాయాలున్నా.. కరోనాకు ఇవాళ్టితో ఏడాది పూర్తవుతోందని చైనా మార్నింగ్ పోస్ట్‌ తెలిపింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్సులో 2019 నవంబరు 17న 55 ఏళ్ల వ్యక్తిలో కరోనా తొలి కేసు వెలుగు చూసిందని ఆ పత్రిక వెల్లడించింది. కరోనా వెలుగుచూసిన ఫస్ట్ వేవ్‌లో రోజుకు గరిష్ఠంగా ఐదు కేసులు వచ్చేవి. డిసెంబర్ 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. చాలా మంది వైద్యులు అవన్నీ మామూలు వైరస్‌ కేసులేనని పొరపడినా.. ఆ నెల 27న హుబెయ్‌లోని ఒక వైద్యుడు మాత్రం ఇవన్నీ కొత్తరకం కరోనా వైరస్‌వేనని గుర్తించారు. గబ్బిలం నుంచి గానీ, మరేదైనా జంతువు నుంచి గానీ ఇది మానవుల్లోకి ప్రవేశించి ఉంటుందనేది ఎక్కువ మంది నమ్మకం. హుబెయ్‌ రాజధాని వుహాన్‌ నగరంలో ఈ ఏడాది జనవరిలో మహమ్మారి తీవ్రత గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దేశదేశాలకూ వైరస్‌ పాకి, లాక్‌డౌన్‌ వంటి అనేక ఆంక్షలకు కారణమై ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీసింది. అగ్ర రాజ్యాధినేత తో సహా ఇప్పటివరకు ఐదున్నర కోట్ల మందికి సోకింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి దారి తీసింది. 2019లో కరోనా బారిన పడిన కనీసం 266 మందిని చైనా అధికార వర్గాలు ఇంతవరకు గుర్తించాయి. వీరందరూ ఏదో ఒక దశలో వైద్య చికిత్స పొందారు. తొలిదశలో కరోనా తీవ్రతను గుర్తించడంలో విఫలం కావడం చైనాపై పెను ప్రభావాన్ని చూపింది. తర్వాత యావత్‌ ప్రపంచం దాని పరిణామాలను అనుభవించింది.

Related posts