రేపటి జనతా కర్ఫ్యూని అందరు తమ విధిగా పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇదొక క్లిష్టమైన సమయమని… అందరూ కలసి కట్టుగా దీన్ని ఎదుర్కోవాలని అన్నారు. రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడవవని చెప్పారు. షాప్స్, మాల్స్ అన్నీ స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఇది తమ ఆదేశం కాదని, ఎవరికి వారు నిర్ణయం తీసుకుని మూసివేయాలని చెప్పారు. నిత్యావసరాలు, చేపలు, పండ్లు, కాయగూరలు అమ్ముకునే వారిపట్ల ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఇతర అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుందని చెప్పారు. తెలంగాణను కరోనా ఏమీ చేయలేకపోయిందనే గొప్ప పేరును తెచ్చుకుందామని అన్నారు.విదేశాల నుంచి వచ్చినవారు క్వారంటైన్ నుంచి పారిపోతుండటంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారంటైన్ నుంచి ఎందుకు పారిపోవాలని ప్రశ్నించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా వైద్యులకు రిపోర్ట్ చేయాలని సూచించారు.