telugu navyamedia
రాజకీయ

అందుకేనా ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా?

తెలుగు పేప‌ర్ ఈనాడు చీఫ్ పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈనాడుకు రాజీనామా చేసారు. ఈనాడుకు 4దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. కార్టూనిస్ట్ గా ప‌నిచేస్తున్న శ్రీధర్ రావుకు ఎంత పేరుందో అంద‌రి తెలిసిందే. ఈనాడు దినపత్రిక ఇంత‌ ప్రాచుర్యం పొందటానికి శ్రీధర్ కార్టూన్లు ఎంతో సహాయపడ్డాయి. ఆయన కార్టూన్లు సూటిగా, వాడిగా పాఠకుడిని హత్తుకు పోయే లాగా ఉంటాయి. ఆయన కార్టూన్ లలో ఎంత వ్యంగ్యం ఉంటుందో అంతే విషయం కూడా ఉంటుంది. ఈనాటి సామాజిక స్థితిగతులని బొమ్మలతో తెలివిగా చెప్పే ప్రయత్నం చేసాడు. కార్టూనిస్ట్ శ్రీధర్ తన కార్టూన్ల ద్వారా తెలుగువారి హృదయాలలో నిలిచిపోయాడు.

Eenadu Cartoonist Sridhar - Resignation Or Retirement?

ఈనాడు పేపర్ లో వచ్చే వార్తల కోసం కోసం ఎంత అతృతగా ఎదురుచుస్తుంటారో ప్రతిరోజు చోటుచేసుకునే పరిస్థితులపై “ఇదీ సంగతీ” లో వచ్చే శ్రీధర్ కార్టూన్ల కోసం అంతే ఆతృతగా ఎదురుచుస్తుంటారు. నిజానికి ఎంతోమంది నాయకులపై విమర్శనాత్మకంగా ఎన్ని కార్టూన్స్ వేసినా దాదాపు ప్రతి నాయకుడు కూడా పాజిటీవ్ గానే తీసుకునేవారట. తన 18వ సంవత్సరంలోనే కార్టూనిస్ట్ గా మొదలైన జీవితంలో కేవలం ఈనాడు వరకే పరిమితం అవ్వలేదు దేశ, అంతర్జాతీయ వేదికలపై కూడా తనదైన శైలిలో గళమెత్తాడు. శ్రీధర్ కార్టూన్ల లో బొమ్మలు నవ్విస్తాయని అందరికీ తెలుసు. అయితే బొమ్మ చూడగానే ఇది ఫలానా వ్యక్తిదని వెంటనే తెలిసిపోయేంతలా బొమ్మలు గీయడం అతని ప్రతిభ

అయితే అనూహ్యంగా శ్రీధ‌ర్ సోమ‌వారం ఈనాడుకు రాజీనామా చేశారు. ఈనాడును వీడాన‌ని, రాజీనామా చేశాన‌ని సోమ‌వారం సాయంత్రం స్వ‌యంగా శ్రీధ‌రే త‌న ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఈనాడుకు శ్రీధ‌ర్ రాజీమానా అన్న‌ వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

ఈనాడు లేని శ్రీధర్ ను, శ్రీధర్ లేని ఈనాడు ను ఊహించలేము. సుమారు 65 ఏళ్ల వయస్సున్న కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ ను, ఈనాడుల‌ను విడ‌దీసి చూడ‌టం అన్న‌ది అసాధ్య‌మ‌నే చెప్పొచ్చు. కేవ‌లం శ్రీధ‌ర్ కార్టూన్ల కోస‌మే తెలుగు ప్ర‌జ‌లు ఈనాడు పేప‌ర్ ను కొనే వాళ్ళు అనే చెప్పొచ్చు. తొలి పేజీలో పాకెట్ కార్ట్యూన్‌తో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించారు. ఆయ‌న విసిరే వ్యంగ్య బాణాల‌కు ల‌క్ష‌లాదిమంది అభిమానులు ఏర్ప‌డ్డారు. ఈనాడులో అత్య‌ధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఆయ‌న‌. ఆయ‌న్ని ఈనాడు యాజ‌మాన్యం ఎప్పుడూ ఉద్యోగిగా చూడ‌లేదు. ఆయ‌నకు ఈనాడు ప‌త్రిక‌కు ఉన్న‌ అనుబంధం అలాంటిది.

గత కొద్ది కాలంగా ఆయన స్పాండలైటిస్ తో బాధపడుతున్నారు. ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆ మధ్యనే కుమారుడి పెళ్లి చేసారు. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసారని అంటున్నారు. కానీ .. ఇటీవ‌ల సంస్థ యాజ‌మాన్యంతో వ‌చ్చిన విభేదాల కార‌ణంగానే శ్రీధ‌ర్ రాజీనామా చేశార‌ని కొంద‌రు, వేతనం విష‌యంలోనూ త‌లెత్తిన విభేదాల‌తో శ్రీధ‌ర్ రాజీనామా చేశార‌ని జర్నలిస్ట్ వర్గాల బోగట్టా . అయితే త‌న రాజీనామాకు కార‌ణ‌మేమిట‌న్న విష‌యాన్ని చెప్ప‌కుండానే.. గౌర‌వప్ర‌దంగా ఈనాడుకు శ్రీధ‌ర్ వీడ్కోలు ప‌లికారు.

గత ఏడాదినో, అంతకు ముందునో ఆంధ్ర ప్రభుత్వం శ్రీధర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించిందని, దానికి మేనేజ్ మెంట్ అంత సుముఖత వ్యక్తం చేయలేదని ఓ టాక్ వుంది. అలాగే ఇటీవల ఈనాడులో నలభై ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీధర్ సన్నిహితులు, బంధువులు కాస్త హడావుడి చేసారని తెలుస్తోంది. ఫంక్షన్ లు, వీడీయోలు, బహుమతులు ఇలా హడావుడి జరిగిందని ఇది కూడా మేనేజ్ మెంట్ కు నచ్చలేదని బోగట్టా.

మొత్తం మీద అలా ప్రారంభమైన వ్యవహారం రాజీనామాకు దారి తీసిందని వినిపిస్తోంది. శ్రీధర్ కు వేరే పత్రికల నుంచి మంచి ఆఫర్లు వ‌చ్చాయి. కానీ శ్రీ‌ధ‌ర్ ఈనాడుని వ‌దిలి వెళ్ల‌లేదు. అలాంటి శ్రీ‌ధ‌ర్ ఇప్పుడు రాజీనామా చేయ‌డం షాకింగ్ విష‌య‌మే.

Related posts