ఓ వ్యక్తి ఎంతో ప్రేమతో పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఆ వ్యక్తి ప్రేమను కాదని కుక్క పక్కదారులు తొక్కింది. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో మూడేళ్ల పెంపుడు కుక్క ప్రవర్తన నచ్చని సదరు యజమాని దాన్ని ఇంటి బయటకు పంపించేశాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం చకాయిలోని వరల్డ్ మార్కెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు పంపించిన కుక్క మెడలో ఓ నోట్ రాసి ఉంది.
ఆ నోట్‌లో ఏం రాసి ఉందంటే.. నిజానికి ఇది చాలా మంచి కుక్క. దీని ఆహారానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయలేదు. ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదు. ప్రతి ఐదు రోజులకోసారి స్నానం చేస్తుంది. కేవలం పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటుంది. మూడేళ్ల కాలంలో ఒక్కరిని కూడా కరవలేదు. ఇటీవల కాలంలో పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే సమస్యగా మారింది. అందుకే ఈ పెంపుడు కుక్కను బయటకు పంపించాల్సి వచ్చిందని యజమాని నోట్ లో పేర్కొన్నాడు.