మహిళలను గౌరవించడమే తమకు నేర్పారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
నిండు సభలో తన తల్లిని అవమానించినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటూ ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను మంత్రి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
మంగళవారం ఏపీ శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతుకుముందు వరుదు కళ్యాణిని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అయితే తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదంటూ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
తాను మాట్లాడినప్పుడు సభలో బొత్స సత్యనారాయణ లేరని మంత్రి లోకేష్ గుర్తు చేశార. మహిళల గురించి మీరు కూడా మాట్లాడతారా? అంటూ బొత్సపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం తాము కాదంటూ వైసీపీ సభ్యులకు మంత్రి లోకేష్ చురకలంటించారు. ఆ క్రమంలో వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సమాధానం ఇస్తూపై విధంగా స్పందించారు.
ఒక తల్లి పడే ఆవేదన, బాధ తనకు తెలుసునని చెప్పారు. తల్లిని అవమానిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్నారు.
తన తల్లిని అవమానించిన వారు ఈ రోజు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారంటూ లోకేష్ వ్యంగ్యంగా అన్నారు. ఇప్పటికీ వైసీపీ నేతలు మహిళలను దారుణంగా అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు.
మహిళల గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. తమ మహిళలపై కేసులు పెట్టారని అప్పుడు మీరేం చేశారంటూ వైసీపీ నేతలను మంత్రి నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగదంటూ మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. ప్రైవేటీకరణ జరగదని సభలోనే స్పష్టంగా చెప్పామని వైసీపీ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పినా మీకు అర్థం కావట్లేదా? అంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.