ముంబై నగరాన్ని భారీ వర్షాలతో ముంచేస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు నాన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పరువునష్టం కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ముంబై వచ్చిన రాహుల్‌ను పార్టీ నేతలు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలతో నగరం అతలాకుతలం అవుతుంటే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. ఓ పార్టీ నేతలుగా వీధుల్లోకి వెళ్లి బాధితులకు సాయం అందించాల్సిన బాధ్యత మనపై ఉందని హితబోధ చేశారు. పార్టీ పటిష్టం కావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుండాలని సూచించారు. పొత్తుల గురించి ఆలోచించకుండా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.