నాలుగు దశాబ్దాలుగా సొంత గూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.
కర్నూలు గూడెంకొట్టాల ప్రాంతంలోని 150 నిరుపేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందడంతో వారి సొంతింటి కల సాకారమైంది.
మంత్రి నారా లోకేశ్ తన ‘యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
కర్నూలు నగరంలోని అశోక్‌నగర్ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన పంప్‌హౌస్ ప్రాంతంలో దాదాపు 150 కుటుంబాలు గత 40 ఏళ్లుగా పూరిగుడిసెల్లో నివసిస్తున్నాయి.
యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ కర్నూలు వచ్చినప్పుడు, అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఈ గూడెంకొట్టాల వాసులు ఆయనను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారి సమస్యను సావధానంగా విన్న లోకేశ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు చేపట్టారు.
దీని ఫలితంగా, 2025 జనవరిలో జీవో నెం.30ను జారీ చేసి, కోట్ల రూపాయల విలువైన ఎకరా ప్రభుత్వ స్థలాన్ని ఈ పేదలకు కేటాయించారు.
బుధవారం జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వయంగా లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
దీంతో నాలుగు దశాబ్దాల వారి ఎదురుచూపులు ఫలించాయని, ఇచ్చిన మాట ప్రకారం తమకు న్యాయం జరిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
పాదయాత్రలో ఇచ్చిన ఒక హామీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని స్థానిక నాయకులు తెలిపారు.
జగన్ సుపరిపాలన అందించడం ఖాయం : లక్ష్మీపార్వతి