ఎల్వీ సుబ్రమణ్యం… ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఒక్కసారిగా ఎల్వీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ కూడా మొదట ఎల్వీకి ప్రాధాన్యమిచ్చారు. అయితే.. ఆరు నెలల తర్వాత సీన్ మారిపోయింది. తన పేషీ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎల్వీ సుబ్రమణ్యం నోటీసు ఇవ్వడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ కారణంగానే ఎల్వీని నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా పదవి నుంచి తొలగించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఏ మాత్రం ప్రాధాన్యత లేని మానవ వనరుల ఆర్థిక సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా ఎల్వీ సుబ్రమణ్యంను నియమించారు. అప్పట్లో అటు ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లోనూ సంచలనం రేపిన ఈ ఎపిసోడ్ త్వరలో ఓ సినిమాలో కనిపించనుందట. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుతం మానవ వనరుల ఆర్థిక సంస్థ డైరెక్టర్ ఎల్వీ సుబ్రమణ్యంలకు సంబంధించిన ఎపిసోడ్‌ను `ఎర్రచీర` దర్శకుడు సుమన్ బాబు తెరకెక్కించబోతున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచారమైంది. దీనిపై దర్శకుడు సుమన్ బాబు స్పందించారు. “మా సినిమాలో మేం ప్రజల సమస్యలను ప్రధానంగా చూపించాలనుకుంటున్నాం. అలాగే ఐ.ఎ.ఎస్ అధికారి అవినీతి పై పోరాటం చేసి పూర్తిగా అవినీతిని ఎలా అంతమొందించారని తెలియజెప్పే మంచి సందేశాత్మక చిత్రమది. కానీ ఆంగ్ల పత్రికలో సీఎం జగన్, ఎల్వీ సుబ్రమణ్యంగారిని ఇన్వాల్వ్ చేస్తూ ఆర్టికల్ రాశారు. కానీ మా సినిమాకు, వారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ పాయింటే మా సినిమాలో ఉండదు” అన్నారు.
previous post
next post