ఇప్పటివరకు అనేక వస్తుసేవలు ఆన్ లైన్ లో ఇంటివరకు డెలివరీ అయిఉంటాయి. అదే తరహాలో .. డీజిల్ కూడా పొందే అవకాశం ఉంది. నెట్టింట్లో కస్టమర్ తన వివరాలను నమోదు చేస్తే చాలు.. బంక్‌కు వెళ్లకుండానే ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది. ఇక ఈ ప్రయోగాన్ని విశాఖపట్నంలో ప్రారంభించగా.. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటంతో కోరిన వస్తువులన్నీ ఇంటి నుంచే పొందగలుగుతున్నాం. ఇదే క్రమంలో అధిక మోతాదులో డీజిల్ ఉపయోగించే వారు ఫోన్‌లోని యాప్ సాయంతో సులభంగా కోరిన చోటుకు రప్పించుకోవచ్చు. భారత పెట్రోలియం సంస్థ తొలిసారిగా విశాఖలో ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు సరఫరా చేయడానికి ఫ్యూయల్‌కార్ట్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మైసూర్, కోయంబత్తూర్, పూణే వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉండగా.. ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని తీసుకొచ్చారు. అంతేకాక డెలివరీ అయ్యే డీజిల్.. బంకులో అమ్మే ధరకే లభించడం గమనార్హం. ఇక ఫ్యూయల్‌కార్ట్ ద్వారా 200 లీటర్ల నుంచి 4 వేల లీటర్ల వరకు ఆయిల్‌ను ఆర్డర్ చేయవచ్చు.
బుక్ చేసుకునే విధానం ఎలాగంటే..రెపొస్ అనే యాప్‌ను మొదటగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, చిరునామా వివరాలతో పాటు ఎన్ని లీటర్ల డీజిల్, సరఫరా చేయాల్సిన తేదీ చెప్పాలి. ఇక బంక్‌ను ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు పే చేయాలి… అంతేకాక క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. జియో ట్యాగింగ్ ఉండటం వల్ల డీజిల్ తెచ్చే వాహనం ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. వినియోగదారుడు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ నమోదు చేస్తేనే ఆయిల్ అన్ లోడ్ అవుతుంది.