telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుమలలో భక్తుల సేవే ప్రథమ కర్తవ్యం: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాదు

భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నారు

రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతూ భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు

భ‌క్తుల‌ను రెచ్చ‌గొట్టి వీడియోలు చిత్రీక‌రించేవారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం

టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాద‌ని టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు.

వేస‌వి సెల‌వుల కార‌ణంగా తిరుమ‌ల‌లో అధిక ర‌ద్దీ నెల‌కొన‌డంతో శిలాతోర‌ణం దగ్గర మొదలవుతున్న ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు.

భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న‌, పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భ‌క్తులంద‌రూ టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌పై అద‌న‌పు ఈవో వ‌ద్ద సంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ నిన్న ఓ వ్య‌క్తి ద‌ర్శ‌న క్యూలైన్ లో అన్న ప్ర‌సాదాలు అంద‌లేద‌ని నినాదాలు చేసిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు. ఆయ‌నను వెంట‌నే సంప్ర‌దించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ర‌ద్దీ గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌న స‌మ‌యం ఆల‌స్య‌మ‌వుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసిన‌ట్లు ఒప్పుకున్నారు.

అయితే క్యూలైన్ లో అన్న ప్ర‌సాదాలు, పాలు అందిస్తున్నది గమనించి త‌న త‌ప్పును గ్ర‌హించి మాన‌సిక క్షోభ‌కు గురై, పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరిన‌ట్లు కూడా ఆ భ‌క్తుడి తెలియ‌జేశాడ‌ని చెప్పారు.

టీటీడీ అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు క్యూలైన్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ భక్తుల‌కు అందిస్తున్న స‌దుపాయాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌తిరోజూ ఒక ల‌క్ష‌కు పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నార‌ని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 ల‌క్ష‌లు దాటుతోంద‌ని చెప్పారు. వీఐపీ బ్రేక్‌, శ్రీ‌వాణి ద‌ర్శ‌నాల‌ను త‌గ్గించి సాధార‌ణ భ‌క్తుల‌కే ద‌ర్శ‌నాల్లో పెద్ద‌పీట వేస్తున్నామ‌న్నారు. ప్ర‌తిరోజూ 60శాతానికి పైగా స‌ర్వ ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులే స్వామివారిని ద‌ర్శించుకుంటున్నార‌ని చెప్పారు.

సాధార‌ణ రోజుల‌కంటే 10 వేల మందికి భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌న‌మ‌య్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్లు నిద్ర లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలియ‌జేశారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా నిరంత‌రాయంగా అన్న ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఆరోగ్య విభాగం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం త‌లెత్త‌కుండా పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని తెలిపారు.

టీటీడీ సిబ్బంది కృషిని ప‌ట్టించుకోకుండా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా కొంద‌రు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని ఆయ‌న తెలిపారు. కొంద‌రు అన‌ధికారిక వ్య‌క్తులు ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో భ‌క్తుల‌ను రెచ్చ‌గొడుతూ వీడియోలు చిత్రీక‌రిస్తున్నార‌ని, అలాంటివారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

విప‌రీత ర‌ద్దీ నేప‌థ్యంలో భ‌క్తులు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సంయ‌మ‌నం పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకోవాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమ‌న్నారాయ‌ణ‌, హెల్త్ ఆఫీస‌ర్ శ్రీ మ‌ధుసూద‌న్‌, వీజీఓ శ్రీ సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.

Related posts