ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు.
భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లుపై సీఎస్ ఇవాళ మధ్యాహ‍్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, జీఏడీ అధికారులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.