వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేతలు ఖండిస్తుండటం తెలిసిందే. తాజాగా, టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ, జగన్ చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని అన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తోంది అంటే దానికి కారణం గత ప్రభుత్వమేనని, చంద్రబాబు కష్టమేనని అన్నారు.
ఈ సందర్భంగా కర్ణాటకలోని జగన్ కు చెందిన విద్యుత్ కంపెనీల గురించి ఆయన ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోళ్ల అగ్రిమెంట్లలో జగన్ కంపెనీల్లో యూనిట్ ధర ఐదు రూపాయలు తీసుకుంటున్నారని దానిపై జగన్ ఏం సమాధానం చెబుతారని అన్నారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వమని చెప్పడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, జగన్ ప్రవర్తన వల్లే ఇలా జరిగిందని దుయ్యబట్టారు.

