రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామని, కార్యాచరణపై ప్రతి జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తల సూచనలు తీసుకున్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి అందరితో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నామని, 2500 కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే తాను పర్యటించానని అన్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా అందరితో స్వయంగా మాట్లాడానని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా అడుగులు వేస్తామని షర్మిల అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ సర్కార్, ప్రధాని మోదీ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలు బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకుంటే… చంద్రబాబు కూటమిలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రం కోసం మోదీని నిలదీస్తోందని అన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నారంటే అందుకు చంద్రబాబే కారణమని, అయినా రాష్ట్రం కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినా ఒక్కరూ కూడా మాట్లాడటం లేదని, 41 మీటర్లకు నీటి నిల్వ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకున్నా.. ఏపీ నుంచి ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించడంలేదని షర్మిల మండిపడ్డారు.
రాజధాని అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామన్న దానిపై ఇంత వరకు స్పష్టత లేదన్నారు.
విభజన హామీ ఒక్కటి కూడా అమలు కాకపోయినా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీకి మద్దతు ఇస్తున్నారని, బీజేపీని వైయస్సార్ మొదటి నుంచీ వ్యతిరేకించారని ఆమె అన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాత్రం మోదీకి గులాం గిరీ చేశారని, కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ .. తన మెడను మోదీ ముందు వంచారని ఎద్దేవా చేశారు.
ఇప్పటికీ మోదీని ఒక్క మాట అనకుండా జగన్ దత్త పుత్రుడిగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబును మాత్రమే జగన్ విమర్శిస్తున్నారని, మోదీ మోసాలను ప్రశ్నించడం లేదని షర్మిల దుయ్యబట్టారు.
కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు.
నాలుగేళ్ల కాలంలో ఏపీలో కాంగ్రెస్‌ను అన్ని విధాలా బలోపేతం చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌పై నమ్మకం, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు, భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలనుకునేవారు ముందుకు రావాలని ఆమె పిలుపిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేలా సేవలు అందించాలని పిలుపునిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కోసం కమిట్మెంట్తో పని చేసేవారు, చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజల విశ్వాసమని అన్నారు.
కాంగ్రెస్‌లో ప్రజలకోసం ఇందిరా గాంధీ, రాజీవ్, వైఎస్ఆర్ వంటి నేతలు ఎన్నో త్యాగాలు చేశారని, సోనియా, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు రిసోర్సు లేకపోవడం బాధాకరమని అన్నారు. అదే ఉంటే ఏపీలో కాంగ్రెస్ అన్ని విధాలా ఎదుగుతుందన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏపీ విభజన హామీలు అమలు అవుతాయని, ప్రజా సేవ చేయాలనుకుంటే కాంగ్రెస్‌లో చేరాలని.. కలిసి పని చేద్దామని వైఎస్ షర్మిల పిలుపిచ్చారు.
40 రోజుల తర్వాత రీపోలింగ్ ప్రజాస్వామ్య విరుద్దం: లోకేష్