గత నెలలో కొలంబియాలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సారధ్యం వహిస్తున్న ప్రజాసంఘాలు రేపు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో ఆందోళనలు మరింత ఉధృతం కానున్నాయి. గత నెల 21 నుండి జాతీయ స్థాయి సమ్మెతో ప్రారంభమైన ఈ ఆందోళనలు, ర్యాలీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ప్రజలతో పాటు సామాజిక సంస్థలు పెద్దయెత్తున భాగస్వాములవుతున్నాయి.
రేపు దేశవ్యాప్త సమ్మె నిర్వహించటం ద్వారా తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని, డిసెంబర్ 8న రైజ్ యువర్ వాయిస్ పేరుతో భారీ యెత్తున పాటల ప్రదర్శన ఏర్పాటు చేశామని ఈ ఆందోళనలకు సారధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలలో ఒకటైన సెంట్రల్ యూనియన్ ఆఫ్ వర్కర్స్ అధ్యక్షుడు డియొజెన్స్ ఊర్జులా చెప్పారు. ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు.