*తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు
*కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం
*తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
*నిర్మాణ పనుల తుది దశలో ఉన్న నూతన సచివాలయం
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో జారీ చేయనుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని ఆయన అన్నారు.
ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని.. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నవని పేర్కొన్నారు.
అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోందని కేసీఆర్ తెలిపారు. సమాఖ్య స్ఫూర్తి అమలు ద్వారానే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయన్న అంబేడ్కర్ స్ఫూర్తి తమను నడిపిస్తోందని అన్నారు.
కుల, మత, లింగ, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన గౌరవం లభించి.. అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన భారతీయత అని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పుడే నిజభారతం ఆవిష్కృతమవుతుందని అందుకోసం తమ కృషి కొనసాగుతుందని తెలిపారు
అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది సీఎం కేసీఆర్ పేర్కొన్నారు..
అలాగే పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదని.. భారత దేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిాంచిందని అన్నారు. ఇదే విషయమై తాను ప్రధానమంత్రికి త్వరలోనే లేఖ రాస్తానని స్పష్టం చేశారు