telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ దోసె, కాఫీ రుచి గురించి .. ఉపాసనతో పంచుకున్న చిరంజీవి ..

chiranjeevi shooting memories with upasana

మెగాస్టార్ చిరంజీవిని ప్రతిఒక్కరు అభిమానిస్తారు. అందరితోనూ ఆయన ఎంతో ఆప్యాయంగా మెలుగుతారు. తన ఇంటికి వచ్చినవాళ్లకు ఆయనిచ్చే ఆతిథ్యం మర్చిపోలేని విధంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగాచిరంజీవి ఇంట్లో చేసే దోసెలు, కాఫీ రుచి ఎక్కడా కనిపించదని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ప్రభుదేవా, జయసుధ వంటి వాళ్లు కూడా ఆ రెండింటి కోసమే చిరు నివాసానికి వస్తుంటారంటే అతిశయోక్తి కాదు. అది నిజమేనని చిరంజీవి కూడా అంగీకరించారు. తాజాగా, తన కోడలు ఉపాసనకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దోసె, కాఫీ రుచి గురించి వివరాలు తెలిపారు. మొదట్లో తనకు కాఫీ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ తన అర్ధాంగి సురేఖ చేసే ఫిల్టర్ కాఫీ ఒక్కసారి రుచి చూసిన తర్వాత కాఫీ లవర్ గా మారిపోయానని వివరించారు. సురేఖ నీలగిరి కాఫీ తోటల నుంచి ప్రత్యేకంగా గింజలు తెప్పించి, వాటిని వేయించి పొడిచేసేదని వెల్లడించారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చేశాక కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నామని, అందుకే తమ ఇంటి కాఫీ అంటే జనాలు పడిచచ్చిపోతుంటారని చెప్పారు.

ఓ సినిమా షూటింగ్ కోసం చిక్ మగళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ లో దోసె తిన్నానని, దాని రుచి అమోఘమని అన్నారు. దోసెకు అంత రుచి ఎలా వచ్చిందో చెప్పమంటే ఆ హోటల్ యజమాని నిరాకరించాడని చిరంజీవి వెల్లడించారు. ఇంటికి వచ్చిన తర్వాత సురేఖతో చాలాసేపు చిక్ మగళూరు దోసె గురించే మాట్లాడానని, చివరికి ఇద్దరం కలిసి అనేక కాంబినేషన్లతో ప్రయోగాలు చేసి చిక్ మగళూరు దోసె కంటే అద్భుతమైన రుచి వచ్చే దోసెను సాధ్యం చేయగలిగామని చెప్పారు. తాను సాధించిన దోసె రెసిపీ గురించి చట్నీస్ రెస్టారెంట్ యజమాని అడిగితే ఆనందంగా చెప్పేశానని చిరు పేర్కొన్నారు. ఆ రెసిపీని చిరంజీవి దోసె బ్రాండ్ నేమ్ తో వాళ్లు కస్టమర్లకు పరిచయం చేశారని, అది ఎంతో పాప్యులర్ అయ్యిందని వివరించారు.

Related posts