తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన నటించిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. సురేందర్‌రెడ్డి దర్శకుడు. అమిత్ త్రివేది స్వరకర్త. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్రంలోని తొలి పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఇటువంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’లో 2300 వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ఉంటే… “సైరా”లో 3800 ఉన్నాయని కమల్ కణ్ణన్ మెసేజ్ చేశారు. “మగధీర” స్టోరీ డిస్కషన్స్‌లో చిరంజీవిగారు చరణ్‌ను కాకుండా… తననే హీరోగా ఊహించుకుంటున్నారని మా ఆవిడతో చెప్పాను. తర్వాత ‘రాజమౌళీ… ఇన్ని చిత్రాలు చేశా. కానీ, ఇలాంటి ఓ సినిమా చేయలేకపోయానయ్యా’ అన్నారు. ఆయన కోరికను చరణ్ తీర్చుతున్నాడు’’ అన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు, దర్శక, నిర్మాతలకు, నటీనటులకు గౌరవాన్ని తీసుకొచ్చిన చిత్రాలు చాలా తక్కువ. నేను చిత్రసీమకు వచ్చాక… అంత గౌరవం తీసుకొచ్చిన చిత్రం ‘శంకరాభరణం’. మధ్య మధ్యలో గౌరవాన్ని తెచ్చిన చిత్రాలు కొన్ని ఉన్నప్పటికీ… మళ్లీ రాజమౌళిగారు ‘బాహుబలి’తో అంతటి గౌరవాన్ని తీసుకొచ్చారు. మనమంతా కాలర్ ఎత్తుకొని ‘మేము తెలుగువాళ్లం’ అని చెప్పుకునేలా చేశారు. ప్రేక్షకుల ఆశీస్సులతో ఈ సినిమా మళ్లీ అంతటి గౌరవాన్ని మనందరికీ ఆపాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. నేనిక్కడ మాట్లాడున్నది గౌరవం గురించే… విజయం గురించి ఇంకో సినిమాతో పోల్చడం లేదు. ఇక సెప్టెంబర్ 22… నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్‌మార్క్. 1978లో ఆ రోజున నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ఆ రోజు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? నా భవిష్యత్ ఎలా ఉంటుంది? అనే మీమాంసలో ఉన్నాను. టెన్షన్… ఎగ్జయిట్‌మెంట్… ఏదో తెలియని ఉద్విగ్నత… రకరకాల ఫీలింగ్స్‌తో నేను నేల మీద లేనంటే ఒట్టు. అటువంటి ఉద్విగ్నత, టెన్షన్, ఎగ్జయిట్‌మెంట్ 41 సంవత్సరాల తర్వాత ఈ 2019, సెప్టెంబర్ 22న ఫీలవుతున్నాను. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… ‘సైరా’. ‘స్వాతంత్య్ర సమర యోధుడు పాత్ర చేయాలి. ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి. భగత్ సింగ్ లాంటివి చేయాలి’ అని 22 ఏళ్ల క్రితం చెప్పాను. కానీ, ఎందుకో భగత్ సింగ్ కథను ఎవరూ నా ముందుకు తీసుకురాలేదు. పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ కథను తెచ్చారు. విన్నప్పుడు, ఇది తెర మరుగు కాకూడదని మనసులో గట్టిగా అనిపించింది.. కానీ, కథకు న్యాయం చేయాలంటే బడ్జెట్ ప్రాబ్లమ్. పది పదిహేనేళ్ల క్రితం నా మీద 30, 40 కోట్లు పెట్టి సినిమాలు తీసే రోజుల్లో… 60, 70 కోట్లతో సినిమా చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ఇప్పుడు 151వ చిత్రంగా ఇది చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు శ్రీకారం చుట్టిందీ, ఇన్‌డైరెక్టుగా సపోర్ట్ చేసిందీ దర్శకుడు రాజమౌళి.
ఆయన గనుక ‘బాహుబలి’ తీసి ఉండకపోతే మనకు ఈ రోజు సైరా నరసింహారెడ్డి వచ్చేది కాదు. వందల కోట్లు ఖర్చు పెట్టినా… అంతకు అంత రాబట్టుకోవచ్చనీ, నిర్మాతకు నష్టం ఉండదనీ భరోసా కల్పించారు. తర్వాత రామ్‌చరణ్ వచ్చి ‘డాడీ… రిస్క్ ఉంటుంది. ఈ చిత్రాన్ని ఎవరికైనా అప్పచెప్పి… వాళ్లను మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రాజీ పడకుండా నేనే చేస్తా. మీరు రెడీయా?’ అన్నాడు. నేను ‘సై’ అన్నాను. సురేందర్‌రెడ్డి వాస్తవగాథను వక్రీకరించకుండా, కమర్షియలైజ్ చేస్తూ స్ర్కిప్ట్ రెడీ చేశాడు. నాతో పాటు సన్నిహితులు కొందరు కథ విన్నారు. అందరూ బావుందన్నారు. కానీ, నాలో చిన్న ఆందోళన. ఈ పాత్ర చేయడం శారీరకంగా ఎంతో కష్టం. సినిమా అంతా గుర్రాల మీద స్వారి, కత్తియుద్ధాలు, ఒళ్ళు విరుచుకుని చేసే పోరాటాలు ఉంటాయి. నేనేమో డూప్‌తో చేయలేను. చేస్తే నా అభిమానులు ఒప్పుకోరు. నాకు ఏ కష్టం లేకుండా టెక్నాలజీతో తీస్తామన్నారు. కానీ, శారీరకంగా హింస పెట్టి యాక్షన్ సీక్వెన్స్‌లు రాబట్టారు. కానీ, ఏం చేేసది? ఒక్కసారి మేకప్ వేసుకుని, కత్తి పట్టుకుని, గుర్రం ఎక్కానంటే… నా ఒళ్ళు మర్చిపోతాను. నా వయసు మర్చిపోతాను. అప్పుడు నాకు గుర్తొచ్చేది నా అభిమానులు, నా ఇమేజ్ మాత్రమే. పాతికేళ్ల క్రితం ఏరకమైన జోష్‌తో చేశానో… అదే జోష్ మళ్ళీ నన్ను ఆవహిస్తుంది. యువతకూ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు.
Megastar #Chiranjeevi, Power Star #PawanKalyan, Mega Power Star #RamCharan, Mega Prince @IAmVarunTej , Supreme Hero @IamSaiDharamTej and #PanjaVaishnavTej at #SyeRaaPreReleaseEvent pic.twitter.com/kEv4jTNSo6
— BARaju (@baraju_SuperHit) September 22, 2019
పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “అన్నయ్య చిరంజీవిగారి ఫంక్షన్స్‌కి వచ్చినప్పుడు మీలో (మెగా అభిమానుల్లో ) ఒకరు వచ్చి గుండె పంచుకుంటే ఎలా మాట్లాడతారో… నేనూ అలాగే మాట్లాడతాను. నేను ఇంటర్ ఫెయిలై చచ్చిపోదామనుకున్నప్పుడు ‘జీవితంలో నువ్వు గెలవాలి తప్ప ప్రతి పరీక్ష నీకు కొలమానం కాదు’ అని నాకు ధైర్యాన్ని, గుండెబలాన్ని ఇచ్చారు అన్నయ్య. అవే నన్ను మీ ముందు నిలబెట్టాయి. మద్రాసులో ఉన్నప్పుడు అన్నయ్య దేశం గర్వించే సినిమాలు చేయాలని కోరుకునేవాణ్ణి. నాకు స్టార్‌డమ్ వచ్చినా… అన్నయ్యతో సినిమా చేయలేకపోయా. చరణ్ ఇన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి అద్భుతమైన సినిమా తీసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రపంచ దేశాలన్నీ వచ్చి మనపై దాడి చేశాయి కానీ… మన దేశం ఎప్పుడూ వేరే దేశాలపై దాడి చేయలేదు. భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ లాంటి వ్యక్తుల సమూహం. ఆయన గురించి చరిత్రలో పుస్తకాలు చదివితే కొందరు అర్థం చేసుకోగలరేమో. కోట్లాదిమంది ఒకేసారి అనుభూతి చెందాలంటే… ఇలాంటి సినిమాలు రావాలి. ఇది తీసింది వినోదం కోసం కాదు… ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం ఎన్ని త్యాగాలు చేస్తే వచ్చిందనేది తెలుసుకోవడానికి. ఎంతమంది కొత్తవాళ్లు వచ్చినా… రికార్డులు బద్దలుకొట్టినా… చిరంజీవిగారి అనుభవాన్ని కొట్టేయలేం. మాకు అన్నయ్య నేర్పించిన సంస్కారం ఏంటంటే… ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఆనందపడతాం. ఎందుకంటే… పదిమంది బావుండాలని కోరుకునేవాళ్లం. రాజమౌళిగారు గెలిస్తే, రికార్డులు బద్దలుకొడితే మాకు ఆనందం ఉంటుంది. సురేందర్‌రెడ్డిగారు వచ్చి రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది” అన్నారు.
Megastar #Chiranjeevi, Power Star #PawanKalyan, Ace Director @ssrajamouli, Mega Power Star #RamCharan, Ace Producer #AlluAravind, #ParuchuriVenkateswaraRao, @DirSurender at #SyeRaaPreReleaseEvent pic.twitter.com/pS2f2UC9yx
— BARaju (@baraju_SuperHit) September 22, 2019
అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు కాకుండా ఈ సినిమా చూసిన మొదటి ప్రేక్షకుణ్ణి నేనే. ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎలా ఉంటుందోనన్న భయంతో చూశా. ఒక్కో సీన్ చూసి కింద పడిపోయా. కింద నుంచి లేచి చిరంజీవిగారిని కౌగిలించుకున్నా. అంత అద్భుతంగా సినిమా వచ్చింది’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘‘ఈ వేదికపై నేను చెప్పే మాటలు నాలోపలున్న భావాలను తెలియజేయలేవు. మా చిత్రబృందం అందరికీ థ్యాంక్స్. వాళ్లు లేకపోతే నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదు’’ అన్నారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం 250 రోజులు చిత్రబృందమంతా ఓ కుటుంబంలా చాలా కష్టపడ్డాం. వాళ్లందరికీ, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చిరంజీవిగారికి, రామ్‌చరణ్‌గారికి థ్యాంక్స్. చరణ్ ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు నడిపించారు’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా రారాజు, అన్నయ్య చిరంజీవిగారు ఈ సినిమాలో ఉగ్ర నరసింహస్వామిలా ఉన్నారు” అని వీవీ వినాయక్ అన్నారు.
“రామ్‌చరణ్‌గారు కొన్ని రషెస్ చూపించారు. చిత్రీకరణలో ఉండగా బ్లాక్‌బస్టర్ టాక్ రావడం ఈ చిత్రానికే సాధ్యమైంది” అని కొరటాల శివ అన్నారు. ‘‘ట్రైలర్ విడుదల కాగానే వచ్చిన టాక్, హైప్ చూసి కంగారు వచ్చింది. వెంటనే చిరంజీవిగారికి ఫోన్ చేశా. ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా అంచనాలను చేరుకుంటామని చెప్పారు’’ అని జగపతిబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబసభ్యులతో పాటు నిర్మాతలు డి. సురేశ్‌బాబు, ‘జెమినీ’ కిరణ్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, డీవీవీ దానయ్య, శరత్ మరార్, దర్శకుడు మోహర్ రమేశ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, సాయిమాధవ్ బుర్రా తదితరులు హాజరయ్యారు.