ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పెనుకొండ వ్యవసాయ మార్కేట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు నేతలు ఘన స్వాగతం పలికారు.
ఉదయం శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆత్మార్పణ దినోత్సవం సందర్బంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్ర్తాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కలియుగ పార్వతీదేవిగా అహింసా, శాంతి, సంపద గురించి చాటి చెప్పిన దేవతా వాసవి కన్యకా పరమేశ్వరి అని అన్నారు.
2600 ఏళ్ల క్రితం అహింస జరగకూడదని 102 మంది గోత్రీకులతో ఆత్మార్పణ చేసుకున్న మహిమాన్వితురాలు వాసవి కన్యకాపరమేశ్వరి అని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఆర్యవైశ్యులే కాకుండా అందరి భక్తుల మన్ననలు పొందుతున్న ఏకైక దేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని చెప్పారు.
తొలిసారిగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారిని దర్శించుకోవడం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.
ఆర్యవైశ్యులు సమాజంలో కష్టపడి పనిచేసి నీతి నిజాయితీగా సంపాదించిన సంపాదనలో సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు చేయటం వారి రక్తంలోనే ఉందన్నారు.
ఆర్యవైశ్యులు ధనాన్ని ధర్మ కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని కొనియాడారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి తెలివితేటలతో అభివృద్ధి పరచాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
2047 విజన్ 2.0 స్వర్ణాంధ్రప్రదేశ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది ఆర్యవైశ్యులే అని వెల్లడించారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని ఆ కన్యకా పరమేశ్వరుని మొక్కుకున్నానన్నారు.
అమ్మ ఆశీస్సులతో ఈ పెనుగొండ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

