బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి భారీ షాక్ తగిలింది. రాజస్తాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో రాజేంద్ర గుద్, జోగేంద్ర సింగ్ అవనా, వజీబ్ అలీ, లఖాన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్‌చంద్ ఖేరియా ఉన్నారు.
మరో రెండు నెలల్లో రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగానే బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. రాష్ట్రాభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని ఎమ్మెల్యే రాజేంద్ర స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పని విధానం నచ్చే పార్టీలోకి వచ్చామని తెలిపారు. రాజస్తాన్‌ను ఆయన కంటే గొప్పగా పాలించే సీఎం మరెవరూ లేరని పేర్కొన్నారు.