కార్యా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్ ద్వారా సాక్ష్యం సేవ ఆర్గనైజేషన్ చేస్తున్న నేత్రదాన అవగాహన కార్యక్రమంలో భాగమయ్యారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “అందరికీ నమస్కారం. సర్వేంద్రియానాం నయనం ప్రదానం అంటారు. మనిషి శరీరంలో అన్ని అవయవాల్లోకెల్లా కళ్లు చాలా ప్రధానమైనవి. అనంత సృష్టిలో ఉన్న ప్రతిదానిని కళ్లతో చూసి ఆనందించగల ఓ అద్భుతమైన వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్లు వృధా పోకుండా.. నేత్రదానం చేసినట్లయితే మనం ఇచ్చే రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. మనం మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం. చనిపోయిన తర్వాత వ్యర్థ పదార్థం లాగా మట్టిలో కలిసిపోవడం కంటే.. మనలో ఉన్న అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఎన్నో దానాలు చేస్తుంటాం. ఎన్నో దానాలు చేశామని మనం చెప్పుకుంటూ ఉంటాం. కార్నియా అంధత్వ ముక్త భార్గ్ అభియాన్ ద్వారా సాక్ష్యం ఆర్గనైజేషన్ వాళ్లు కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే 350 విలేజెస్‌లో నేత్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ.. కావాల్సిన నెట్ వర్క్ కూడా వాళ్లకి ఏర్పాటు చేస్తూ ఇంకా ఎంతో అభివృద్ది చేయాలనే ఆలోచన సాక్ష్యం ఆర్గనైజేషన్‌కు రావడం హ్యాట్సాఫ్. అలాంటి ఆలోచన కలిగి దాన్ని ప్రాక్టికల్‌గా కార్యరూపంలో పెట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను” అని బ్రహ్మానందం పేర్కొన్నారు.
previous post

