బెంగళూరు విజయంలో విరాట్ (100; 58 బంతుల్లో 9×4, 4×6) మెరుపు శతకం చేసి కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు మొయిన్ అలీ (66; 28 బంతుల్లో 5×4, 6×6) విరుచుకుపడడంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ (1/32), రసెల్ (1/17) మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశారు. ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. నితీష్ రాణా (85 నాటౌట్; 46 బంతుల్లో 9×4, 5×6), ఆండ్రి రసెల్ (65; 25 బంతుల్లో 2×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా బెంగళూరు స్కోరు సమీపంగా మాత్రమే తీసుకొచ్చారు కానీ కోల్‌కతాను గెలిపించలేకపోయారు.
కోల్‌కతా 214 పరుగుల భారీ ఛేదనలో నత్తనడకన సాగింది. 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 84 మాత్రమే. ముఖ్యంగా ఉతప్ప (20 బంతుల్లో 9) మరీ జిడ్డుగా ఆడాడు. ఇలాంటి స్థితిలో రసెల్, నితీష్ రాణాలు అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు. బెంగళూరు బౌలర్లను భయపెడుతూ సిక్స్‌లతో చెలరేగిపోయారు. ముఖ్యంగా రసెల్ తన మార్క్ సిక్స్‌లతో స్కోరును అమాంతం పెంచాడు. 15వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదిన ఈ విండీస్ వీరుడు.. ఆ తర్వాత స్టాయినిస్ బౌలింగ్‌లోనూ వరుసగా మూడు సిక్స్‌లు కొట్టాడు. రాణా కూడా సిక్స్‌లు, ఫోర్లు దంచడంతో కోల్‌కతా ఒక దశలో లక్ష్యానికి సమీపంగా వచ్చింది. చివరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సి రాగా… మొయిన్ అలీ తొలి రెండు బంతులకు ఒకే పరుగు ఇవ్వగా… మూడో బంతిని రసెల్ సిక్స్ బాదాడు.. ఆ తర్వాత బంతిని అతను కొట్టలేకపోవడంతో బెంగళూరు విజయం ఖాయమైంది. రసెల్-రాణాలు 14.75 రన్‌రేట్‌తో ఐదో వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
బెంగళూరు ఆరంభంలో ధాటిగా ఆడలేకపోయింది. 4 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 26 పరుగులే. దీనికి తోడు పార్థివ్ పటేల్ (11) వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ స్థితిలో కోహ్లి అడపాదడపా ఫోర్లు కొట్టి బెంగళూరు రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నాడు. ఆదిత్యనాథ్ (13)ను ఔట్ చేసిన రసెల్ బెంగళూరును దెబ్బ కొట్టాడు. 10 ఓవర్లకు బెంగళూరు చేసింది 70 పరుగులు మాత్రమే. ఈ స్థితిలో మొయిన్ అలీ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. కోహ్లి తోడుగా అలీ చెలరేగిపోయాడు. ఆడిన రెండో బంతికే సిక్స్ బాదిన అలీ.. ఆ తర్వాత టాప్ గేర్‌లోకి వెళ్లిపోయాడు. 24 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించిన మొయిన్.. కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగులు జత చేశాడు. అలీ ఎంతగా చెలరేగాడో చెప్పడానికి బెంగళూరు 16వ ఓవర్ చూస్తే చాలు.. కుల్‌దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతిని ఫోర్ కొట్టిన అలీ… రెండో బంతిని స్లాగ్ స్వీప్‌తో సిక్స్ బాదాడు… మూడో బంతి కూడా బౌండరీ చేరింది. నాలుగో బంతి లాంగ్‌ఆన్‌లో సిక్స్‌గా మారింది. ఐదో బంతి వైడ్ కాగా… అదనంగా లభించిన బంతిని అలీ లాంగ్‌ఆఫ్ మీదుగా మరో భారీ సిక్స్ కొట్టడంతో బెంగళూరు స్కోరు రాకెట్ వేగంతో పరుగులెత్తింది. అయితే ఇదే ఓవర్ ఆఖరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అలీ.. ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
విరాట్, అలీ ఔటైనా ఆగలేదు..గర్నీ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో పాటు బౌలర్ తల మీదగా మెరుపు సిక్స్ బాదాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్‌కు కూడా కోహ్లి తన బ్యాట్ పదును చూపించాడు. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో వరసగా సిక్స్, ఫోర్ బాది 90ల్లోకి వెళ్లిన విరాట్.. ఆఖరి ఓవర్లో సెంచరీ చేస్తాడా లేదా అనిపించింది. ఎందుకంటే తొలి బంతికి విరాట్ సింగిల్ తీయగా.. ఆ తర్వాత రెండు బంతులకు స్టాయినిస్ ఫోర్, సిక్స్ కొట్టడంతో.. కోహ్లికి స్ట్రెకింగ్ వస్తుందా అనిపించినా.. నాలుగో బంతికి స్టాయినిస్ సింగిల్ తీయగా.. ఐదో బంతిని బౌండరీ బాదిన కోహ్లి ఐపీఎల్‌లో ఐదో సెంచరీని నమోదు చేశాడు. చివరి 5 ఓవర్లలో ఆర్‌సీబీ 91 పరుగులు పిండుకుంది.
నేటి మ్యాచ్ లు : ముంబై vs రాజస్థాన్ సాయంత్రం 4 గంటలకు; పంజాబ్ vs ఢిల్లీ రాత్రి 8 గంటలకు జరుగుతాయి.