telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అతడు’ నిజంగా ‘సూపర్ మ్యానే’… సోనూసూద్ కు పోటేత్తిన ప్రశంసలు

Sonu-Sood

సూపర్ మ్యాన్ సోనూసూద్.. సూపర్ మ్యాన్ సోనూసూద్.. నిజం ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియానే కాదు, ప్రధాన పత్రికల్లో కూడా ఇప్పుడు సోనూసూద్ నామ జపమే. కరోనా సమయంలో బయటకొస్తే ఎక్కడ ఆ రోగం అంటుకుంటుందోనన్న భయంతో అందరూ ఇంటికే పరిమితమైన వేళ.. సోనూసూద్ ఈ వైరస్ ని లెక్క చేయకుండా పేదలు, వలస కార్మికులు, అభాగ్యులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలాడు. తిండి పెట్టాడు. వాళ్ళకోసం వందలాది బస్సులు, రైళ్లు, చివరికి విమానాలను కూడా బుక్ చేసి సొంతూళ్లకు చేర్చాడు.

Sonusood

ఒకప్పుడు తమ దుకాణాలపై, వాహనాలపై బిగ్ స్టార్ల పేర్లు రాసుకున్న జనం ఇప్పుడు సోనూసూద్ పేరు రాసుకుంటున్నారు. ఎంతోమంది తల్లులు తమ బిడ్డలకు సోనూసూద్ అని పేరు పెట్టుకున్నారు. దుకాణాలకూ ఆయన పేరు పెట్టుకున్నారు. నిజంగా ఇది నమ్మశక్యం కానిది. నిజం చెప్పాలంటే సోనూ చాలా మంది వ్యాపారవేత్తల్ల రూ.వేల కోట్లు ప్రభుత్వానికి ఏమీ విరాళంగా ఇవ్వలేదు. కనీసం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లా ఒకే సారి రూ. 30 కోట్లేమీ అందించలేదు. అయినా కరోనా టైంలో ఎవరికీ దక్కనంత పేరు, ప్రఖ్యాతలు సోనూకే దక్కాయంటే ఆయన పడ్డ శ్రమ, సందర్భోచితంగా చేసిన సాయమే కారణం. నిజంగా ఆయన సినిమాల్లో హీరో కాదు..విలన్. హీరోలతో పోల్చితే ఆయనందుకునే పారితోషికమూ తక్కువే. అయినా సాయం చేయడంలో మాత్రం హీరోల కన్నా మిన్నేనని నిరూపించుకున్నాడు. మన సినీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళు సాయం చేయలేదా అంటే చేశారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా మొదలైన సమయంలో ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) స్టార్ట్ చేశారు. తాను రూ.కోటి విరాళం ప్రకటించటంతో పాటు మరో రూ. 7 కోట్ల మేర నటీనటులు, ఇతర పెద్దల నుంచి విరాళాలు సేకరించారు.

ఆ సొమ్ముతో సినీ కార్మికులకు మూడు నెలలకు సరిపడా సరుకులు అందజేశారు. మిగిలిన సొమ్ము కూడా కార్మికుల భవిష్యత్ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు. ప్రభాస్ ఏకంగా రూ. 4 కోట్లు, పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్లు విరాళం ప్రకటించారు. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్, అల్లు అర్జున్, చరణ్ వంటి స్టార్లు పెద్ద మొత్తంలోనే సాయం ఇవ్వగా మిగిలిన వారు కూడా తోచినంత ఇచ్చారు. విజయ్ దేవరకొండ సొంతంగా ఇంటింటికీ సరుకులు అందజేశారు. శేఖర్ కమ్ముల వంటి వారు బయటకు చెప్పకుండా పారిశుధ్య కార్మికులకు ఎంతో సాయం చేశారు. ఇటీవల బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్స్ విభాగాలకు హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అయితే అగ్ర హీరోలు తలుచుకుంటే కరోనా నిరాశ్రయులకు మరింత సాయం అందేదనే మాట వినిపిస్తోంది. వారు రంగంలోకి దిగి ఉంటే అభిమానులు కూడా భారీగా ముందుకు వచ్చి సాయం చేసేవారు. ఎటువంటి ఫ్యాన్ బేస్ లేని సోనూసూద్ ఇంత చేయగలిగాడంటే… ఇక పెద్ద స్టార్లు తలుచుకుని ఉంటే జనానికి మరింత సాయం అందేది.

Sonusood

మహారాష్ట్రలో శివ సేన పార్టీ ప్రముఖ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘దేశంలో ఒక కొత్త మహనీయుడు పుట్టాడు’ అంటూ సోనూను ఉద్దేశించి సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సాయం పేరుతో పేరు తెచ్చుకుని రేపు రాజకీయాల్లోకి వస్తాడు అంటూ విమర్శించాడు. ఇలాంటి విమర్శలు చాలా వినిపించినా సోనూసూద్ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకెళ్లాడు. తనకు వినతులుగా వచ్చినవి, సమస్యల్లో ఉంటూ తన కంట పడ్డవారికి సాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. మాజీ సీఎం చంద్రబాబు వంటి వారు సోనూని ఉద్దేశిస్తూ ‘నిన్ను స్ఫూర్తిగా తీసుకుని రైతు బిడ్డల చదువుకు బాధ్యత తీసుకుంటాను’ అని ప్రకటించారు. ఇక దర్శకుడు క్రిష్ అయితే సోనూను ‘సూపర్ మ్యాన్’ గా పోల్చుతూ అభినందనలు తెలిపారు. కూతుళ్లనే కాడెద్దులుగా మార్చి పొలం దున్నిన మదనపల్లె రైతుకు సోనూ ట్రాక్టర్ అందజేయడంతో సోషల్ మీడియాలో సోనూకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరింత జనం మెప్పు పొందాలని ఆశిద్దాం.

Related posts