ఏపీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.
ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దుల్లోకి 8 కోట్ల 20 లక్షల రూపాయిలు సొమ్మును బాలాజీ తీసుకొచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి.
అప్పట్లోనే ఈ సొమ్మును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. మరోవైపు సిట్ బృందం వెంటాడుతుందనే భయంతో వీరిద్దరూ ఇండోర్ పారిపోయారు.
అయితే ఇండోర్ నుంచి ఏపీలో వైసీపీ నేతలకు ఫోన్ చేస్తుండడంతో లోకేషన్ ఆధారంగా ఇండోర్‌కు వెళ్లాయి సిట్ బృందాలు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇద్దరిని సిట్ బృందం ఇండోర్‌లో అదుపులోకి తీసుకుంది. గతంలో బాలాజీని పోలీసులు అరెస్టు చేశారని కోర్టులో వైసీపీ నేతలు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.
తమ అదుపులో లేరని అప్పట్లోనే సిట్ బృందం కోర్టుకు తెలిపింది. ఇక అప్పటి నుంచి బాలాజీ, నవీన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సిట్ ఎట్టకేలకు ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

