telugu navyamedia
సినిమా వార్తలు

సినీ కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి: అనిల్ కుమార్

తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో వివిధ ఆరోపణలపై సెక్షన్ 51 ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాథమిక విచారణ జరుగుతోంది. పూర్తి నివేదిక అందిన తర్వాతే నిజానిజాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో అంతా సంయమనం పాటించాలని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని కోరారు. ఈ నెల 29న హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఎంక్వైరీ కమిటీ రిపోర్టును సభ్యులకు తెలియజేస్తామని అనిల్ కుమార్ తెలిపారు. ఈ జనరల్ బాడీ మీటింగ్ తర్వాత చాలా విషయాలపై స్పష్టత వస్తుందని, అప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తామని, అంతవరకు ఎవరూ అనవసర ప్రచారాలు చేయవద్దని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ తేది 03.08.2021న సొసైటీ కమిటీకి అందజేయడం జరిగింది. సెక్షన్ 51 ఎంక్వయిరీ ప్రకారం రిపోర్ట్ 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులకు తెలియజేయాలి. కావున ఈ నెల 29.08.2021న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వయిరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చినది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఈ విషయమై చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడమైనది.

సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత నిజమైన అన్ని విషయాలు తెలుస్తాయి. దయచేసి అందరినీ పూర్తి ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చే వరకు వేచి చూడమని కోరుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్ అయిన తర్వాత మేము అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాము. దీంతో ఆయా విషయాలపై స్పష్టత వస్తుంది. కాబట్టి 1600 కుటుంబాల ఆవేదన అర్థం చేసుకుని ప్రాజెక్ట్ కు ఇబ్బంది కలగకుండా సహకరించాలని కోరుతున్నామని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వెల్లడించారు.

Related posts