telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోంది: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ప్రపంచ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి నలుగురు భారతీయ ఐటీ నిపుణుల్లో ఒకరు మన రాష్ట్రానికి చెందినవారే ఉండటం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సును ఆయన ప్రారంభించి, ‘డిజిటల్ ఏపీ’ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం మంది ఏపీ వారే. గట్టి సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి ఇదే నిదర్శనం” అని తెలిపారు.

గతంలో తాను నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తెలంగాణ తలసరి ఆదాయంలో అగ్రస్థానానికి చేరిందని గుర్తుచేశారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి వివరిస్తూ, అమరావతిలో అత్యాధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

“ప్రముఖ సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌ సహకారంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.

సాంకేతికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాల్సిన అవసరం ఉందని, నేడు ప్రజలకు అవసరమైన అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. “ప్రజలకు మేలు చేసే ఎన్నో కొత్త సంస్కరణలను మోదీ తీసుకొచ్చారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా ఆయన నిలిచారు” అని కొనియాడారు.

Related posts