telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సెప్టెంబర్ 2025 జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం

ఆంధ్ర ప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది.

2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో రూ.2,789 కోట్ల ఆదాయం రాగా, స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లుగా నమోదయ్యాయి. 2024 సెప్టెంబర్‌తో పోల్చి చూస్తే నికర రాబడి 7.45 శాతం పెరిగింది.

ఇది రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఓ మైలురాయిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర జీఎస్టీ (ఎస్‌జీఎస్‌టీ) రూపంలో రూ.1,185 కోట్లు, ఐజీఎస్‌టీ సర్దుబాటు ద్వారా మరో రూ.1,605 కోట్లు ఖజానాకు చేరాయి.

రాష్ట్రంలో వస్తు వినియోగం పెరగడంతో పాటు, పన్నుల సేకరణలో అధికారులు కఠినంగా వ్యవహరించడమే ఈ వృద్ధికి కారణమని ప్రధాన వాణిజ్య పన్నుల శాఖ అధికారి  తెలిపారు.

జీఎస్టీతో పాటు ఇతర పన్నుల వసూళ్లలోనూ ఏపీ ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూపంలో సెప్టెంబర్‌లో రూ.1,380 కోట్ల ఆదాయం వచ్చింది.

గత మూడు నెలలుగా పెట్రోల్ అమ్మకాలు నిలకడగా పెరగడమే ఇందుకు దోహదం చేసింది. మరోవైపు వృత్తిపన్ను వసూళ్లలో ఏకంగా 43.75% వృద్ధి నమోదవడం విశేషం.

రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు, ఉద్యోగిత పెరిగిందనడానికి ఇది సూచికగా నిలుస్తోంది.

Related posts