telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం ప్రాజెక్టు వ‌ద్ద మూడో ప్రమాద హెచ్చరిక..

గ‌త‌వారం రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న‌ వర్షాలతో ఆంధ్రప్రదేశ్  అతలాకుతలం అవుతోంది.  చరిత్రలో ఎన్నడూ లేనంత కుంభవృష్టి కురుస్తోంది. గురువారం అతిభారీ వర్షాలు, శుక్రవారం భారీగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులూ, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా నదుల్లో వరద ప్రవాహం భారీగా చేరుతోంది. వీటికి తోడు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉరకలేస్తోంది.

ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 15.97 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టులోని 48 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గేట్లను నిర్మించామని అధికారులు చెబుతున్నారు.

అయితే భయం వీడడం లేదు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయక తప్పదంటున్నారు.

ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ శశిభూషణ్ వరద ప్రభావిత జిల్లాలకు సూచనలు చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక వస్తే అనే మండలాలపై ప్రభావం చూపుతుందని, ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ విపత్తుతల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ తెలిపారు.

కోనసీమలోని 40 లంక గ్రామాలకు గోదావరి జలాలు చేరాయి. దీంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తుండటంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ లంకలో 13 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.

ఇప్పటికే అధికారులు లంక గ్రామాల ప్రజల్లో అత్యధికుల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరింత వరద పెరిగితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాలన్నీ చెరువులుగా కనిపిస్తున్నాయి.

 

Related posts