telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రైన్ ఎఫెక్ట్ : రైల్వే శాఖ అప్రమత్తం, 34 ఎంఎంటీఎస్, 15 ఇతర రైళ్లు రద్దు..

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను కాన్సిల్ చేస్తూ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 14 నుంచి 17 వరకు మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొంది. అంతేకాక, మరో 15 ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేసినట్లుగా ప్రకటించింది.

లింగం పల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య తిరిగే రైలు సర్వీస్‌లను రద్దు చేసింది.

లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 9, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 7, సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో 1, లింగపల్లి – సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్, ఉందాన‌గ‌ర్, మేడ్చల్, బొల్లారం స్టేష‌న్ల మ‌ధ్య న‌డిచే రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ స్పెషల్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము స్పెషల్ రైలు, హుజూర్ సాహెబ్ నాందేడ్ – మేడ్చల్ – హుజూర్ సాహెబ్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు ర‌ద్దు అయింది. సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము రైలు సర్వీస్, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైల‌ను కూడా ర‌ద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు – విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

మరోవైపు.. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నేడు జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్ష మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఒక ప్రటన విడదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు.

Related posts