telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

అమెజాన్ తో .. రిలయన్స్ .. భాగస్వామ్యం.. ఎవరికి లాభిస్తుందో మరి..

amazon and reliance partnership

ఇద్దరు వ్యాపార దిగ్గజాలు భాగస్వాములుగా అవుతున్న మరో కొత్త చారిత్రాత్మక ఒప్పందం తెరపైకి వస్తుంది. అమెజాన్‌, రిలయన్స్‌తో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖేశ్‌ అంబానీ-జెఫ్ బేజోస్‌ మధ్య చర్చలు జరుగుతాయని ఈ వ్యవహారంతో సంబంధమున్న ఇద్దరు ఉన్నతోద్యోగులు వెల్లడించినట్లు శుక్రవారం అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ తెలిపింది. ఇద్దరు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు కలవడం ద్వారా ఇప్పటికే భారత్‌లో వ్యాపిస్తున్న వాల్‌మార్ట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. గతేడాది వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌తో భాగస్వామ్యం కోసం అమెజాన్‌ ప్రతిపాదన తెచ్చిందని, అయితే ఇది ఇంకా చర్చల వరకూ వెళ్లలేదని ఉద్యోగి తెలిపారు. ఫిబ్రవరిలోపు రిలయన్స్‌ రీటైల్‌లో 26 శాతం వరకూ వాటా కొనుగోలు కోసం అమెజాన్‌ ప్రతిపాదించినట్లు మరో ఉన్నతోద్యోగి వెల్లడించారు.

వీటి మధ్య బలమైన భాగస్వామ్యం ద్వారా రిలయన్స్‌కు ఉన్న సుమారు 40 రకాల బ్రాండ్‌ల ఉత్పత్తులు, ఇతర వస్తువులకు సులభమైన ఆన్‌లైన్‌ వేదిక ఏర్పడుతుందని వివరించారు. అయితే, ఈ వార్తలపై అమెజాన్‌ గానీ, రిలయన్స్‌గానీ శుక్రవారం స్పందించలేదు. రిలయన్స్.. జియో టెలికాం నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా తన రీటైల్‌ దుకాణాలను డిజిటల్‌గా అనుసంధానించాలనే లక్ష్యంతో ఉంది. ఈ ఒప్పందం సఫలమైతే సాంకేతికత, సరకు సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్‌లలో అమెజాన్‌కు ఉన్న ప్రపంచ అనుభవం రిలయన్స్‌కు తోడ్పడుతుంది.

రిలయన్స్‌కు దేశ వ్యాప్తంగా దాదాపు 10,600కు పైగా రీటైల్‌ దుకాణాలు ఉండడం అమెజాన్‌కు బాగా కలిసొస్తుంది. అంతేకాక అంబానీ కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడులు బాగా ఉపయోగపడే అవకాశముందని వ్యాపార పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాటా విక్రయానికి చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబాతో గతంలో రిలయన్స్‌ చర్చలు జరిపింది. కానీ మదింపులో భేదాభిప్రాయాలు రావడంతో అది ఆగిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ-కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో గతేడాది డిసెంబరులో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఇవి అమెజాన్‌ వంటి సంస్థలకు అడ్డంకిగా మారాయి. దీంతో భారత్‌లో మరింత విస్తరించాలనుకుంటున్న ఇలాంటి సంస్థల చూపు రిలయన్స్‌పై పడింది.

Related posts